![]() |
![]() |

యాక్షన్ కింగ్ అర్జున్ ఆరోపణలపై విష్వక్‌సేన్ ఎట్టకేలకు స్పందించాడు. ఒక స్పాట్ బాయ్ తనను నాన్ ప్రొఫెషనల్ యాక్టర్‌గా ప్రకటించినా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని విష్వక్ అన్నాడు. తనలోని అంకితభావం శంకించలేనిదని ఆయన చెప్పాడు. 'రాజయోగం' సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా హాజరైన సందర్భంగా విష్వక్ ఈ కామెంట్స్ చేశాడు.
విష్వక్‌సేన్ తీరు పట్ల ఇటీవల అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. కథ నచ్చి, అన్ని మాట్లాడుకున్న తర్వాత ప్రతిసారి షూటింగ్ కి రాకుండా ఏవో సాకులు చెబుతున్నాడని విష్వక్‌పై ఆయన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని, ఆయన కారణంగా సీనియర్ నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయని అర్జున్ చెప్పుకొచ్చారు. విష్వక్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించకపోవడంతో అతని స్థానంలో మరో నటుడిని తీసుకుంటున్నట్లు అర్జున్ తెలిపారు. విష్వక్, ఐశ్వర్య అర్జున్ జంటగా అర్జున్ సర్జా ఓ చిత్రాన్ని ప్రారంభించారు.
అర్జున్ వ్యాఖ్యలపై విష్వక్ స్పందిస్తూ, తాను స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు సూచించానని, అయితే అర్జున్ వినే మూడ్‌లో లేరని చెప్పాడు. "నేను సూచనలు చేసినప్పుడు, ఆయన తనను గుడ్డిగా అనుసరించమని అడిగాడు. నా పది సూచనల్లో కనీసం రెండింటిని ఆయన ఒప్పుకున్నా నేను ఆ సినిమాతో జర్నీ కొనసాగించేవాడిని. నా పరిస్థితి ప్రేమలేని పెళ్లిలా ఉంది" అని అన్నాడు విష్వక్.
తను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదని స్పష్టం చేశాడు. "నేను గదిలోని విషయాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. నేను సినిమాని వదలలేదు, అలాగే ఆ సినిమాని పక్కన పెట్టలేదు. మీడియాలో నాపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు" అని ఆయన అన్నాడు.
ఈ మధ్య విష్వక్‌సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా గ్రాండ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. ఇప్పుడు ఆయన విష్వక్‌పై ఆరోపణలు చేయడంతో ఈ ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకుంది.
![]() |
![]() |