Home

»

Latest News

గ‌త చరిత్ర‌గా మిగల‌నున్న‌ హైద‌రాబాద్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క‌ శ్రీ‌మ‌యూరి థియేట‌ర్‌!

Jul 19, 2021 10:52AM

 

విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాకా అనేక సినీ ప్ర‌ముఖులు ప్రేక్ష‌కుల‌తో క‌లిసి సినిమాలు చూసిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ‌మ‌యూరి థియేట‌ర్ అతి త్వ‌ర‌లో చ‌రిత్ర‌పుట‌ల్లో క‌లిసిపోనున్న‌ది. చిక్క‌డ‌ప‌ల్లికి అనుకుని నిత్యం ర‌ద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అనేక ర‌కాల వ్యాపార కార్య‌క‌లాపాల‌తో పాటు ప‌లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు కూడా ఉంటాయి. అయితే అక్క‌డి వాతావ‌ర‌ణం క్ర‌మేపీ మారిపోతున్న‌ది. సంక్షోభంతో ఒక్కొక్క థియేటర్ మూత‌ప‌డుతూ వ‌స్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ముషీరాబాద్‌లోని ఉషామ‌యూరి థియేట‌ర్ మూత‌ప‌డి, దాని స్థానంలో ఒక పెట్రోల్ బంక్ వ‌చ్చింది. ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ‌మ‌యూరి అదే బాట‌లో ప‌య‌నిస్తుండ‌టం సినీ ప్రియుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

1968లో 'సంగం' థియేట‌ర్‌గా ప్రారంభ‌మై, త‌ర్వాత 1992లో 'రామ్ ల‌ఖ‌న్‌'గా, తిరిగి 2001లో 'శ్రీ‌మ‌యూరి'గా పేరు మార్చుకున్న ఆ సినిమా హాలు క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు విల‌విల‌లాడుతూ, త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయింది. త‌మ‌ ఫేవ‌రేట్ హీరో సినిమా రిలీజైన రోజు స‌న్న‌గా ఉండే అక్క‌డి టికెట్ లైన్ల‌లో నిల‌బ‌డి టికెట్ సంపాదించ‌డం అభిమానుల‌కు ఒక స‌ర‌దా అయిన‌, సాహ‌స‌వంత‌మైన ఫీట్‌. హిట్ట‌యిన సినిమా అక్క‌డ వారాల త‌ర‌బ‌డి ఆడ‌టం రివాజు. మ‌ల్టీప్లెక్సుల‌లో ఎక్కువ రోజులు ఆడ‌ని సినిమాలు శ్రీ‌మ‌యూరిలో ఆడుతూ ఉండ‌టం అనేక సంద‌ర్భాల్లో మ‌నం చూశాం. జ‌నం త‌క్కువ‌గా క‌నిపిస్తున్నా సంప్ర‌దాయ సినిమా హాలుకు నిద‌ర్శ‌నంగా శ్రీ‌మ‌యూరి ఇంత‌కాలం ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తూ వ‌చ్చింది. శ్రీ‌ను వైట్ల డైరెక్ట్ చేసిన చిన్న సినిమా 'ఆనందం' అందులో 200 రోజులు ఆడ‌టం ఒక రికార్డు.

ఇన్నేళ్ల‌లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు లాంటి మ‌హాన‌టులు ర‌వితేజ‌, అల్లు అర్జున్ లాంటి ఇప్ప‌టి మాస్ స్టార్‌లు ఈ థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌తో పాటు త‌మ సినిమాల‌ను వీక్షించ‌డం విశేషం. ఈమ‌ధ్య కాలంలో 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమా రిలీజైన‌ప్పుడు ఆ సినిమా హీరో హీరోయిన్లు సుడిగాలి సుధీర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌న్ కూడా ఈ థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చొని సినిమా చూశారు. అలాంటి థియేట‌ర్ ఇటీవ‌లి కాలంలో మునిసిప‌ల్ టాక్సులు, ఎల‌క్ట్రిసిటీ బిల్లులు, సిబ్బంది జీతాలు లాంటివి చెల్లించ‌డానికి కూడా ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితిలోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆదాయ వ‌న‌రులను ప్ర‌భుత్వం తీసేయ‌డం కూడా దీనికి కార‌ణ‌మంటున్నారు.

థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఆదాయాల్లో టికెట్ అమ్మ‌కాల‌తో పాటు క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌, పార్కింగ్ ఫీజులు లాంటివి కూడా ఉంటాయి. అయితే 2018లో థియేట‌ర్లు పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయ‌కూడ‌ద‌నీ, ఉచితంగా పార్కింగ్ అందివ్వాల‌ని ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీచేయ‌డంతో ఆ ఆదాయం లేకుండా పోయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేగంగా విస్త‌రించ‌డం సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కూ మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా మారిపోయింది.

2020 లాక్‌డౌన్ త‌ర్వాత శ్రీ‌మ‌యూరి మ‌ళ్లీ తెరుచుకోలేదు. ఎల‌క్ట్రిసిటీ బిల్లులు క‌ట్ట‌లేక‌పోవ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ఒక‌ప్పుడు వంద‌లాది మంది ప్రేక్ష‌కుల‌ను సౌక‌ర్యంగా తెర‌పై సినిమా చూసేలా చేసిన సీట్లు ఇప్పుడు లేవు. త్వ‌ర‌లో శ్రీ‌మ‌యూరి థియేట‌ర్.. ఏ షాపింగ్ కాంప్లెక్స్ గానో, మ‌రేదైనా క‌మ‌ర్షియ‌ల్ స్పేస్‌గానో మ‌నకు ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com