
తాను సామాన్యుడిని అంటూ పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. ఆస్తిపాస్తులు, కులమతాలకు అతీతంగా అందరూ సామాన్యులే అవుతారు. ప్రతి ఒక్కరిలోనూ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ ఉన్నతంగా, ఉత్తమంగా ఉండాలంటే జరిగే పనికాదు. అయితే అంతా మంచే చెయ్యాలన్న ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారు. ఈ కోణం పవన్‌కల్యాణ్‌లో కనిపిస్తుంది. అయితే ‘పెదకాపు 1’ సినిమా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా కాదు. సామాన్యులైన వారందర్నీ దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది’ అంటూ ‘పెదకాపు 1’ చిత్రం గురించి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల క్లారిటీ ఇచ్చారు.
విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెదకాపు 1’. ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కథ ప్రకారం పవన్‌కల్యాణ్‌కు, సినిమాకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పైవిధంగా స్పందించారు.