![]() |
![]() |
ఒకప్పుడు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ జరిగేవి, వందరోజుల వేడుకలు జరిగేవి... ఇలా పాత రోజుల్లో జరిగిన విశేషాల గురించి ఇప్పుడు మన పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాలం మారింది, జనరేషన్ మారింది, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే కొందరు ప్రేక్షకులకు అది పూర్తి స్థాయిలో అందడం లేదనే చెప్పాలి. ఎందుకంటే 20 ఏళ్ళ క్రితం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో పండగలా భావించేవారు. ఇక ఫ్యామిలీ, పిల్లల విషయం అయితే చెపక్కర్లేదు. ఆరోజుల్లో అలా సినిమా చూసిన వారికి ఇప్పుడవి స్వీట్ మెమరీస్‌గా ఉంటున్నాయి. కానీ, ఇప్పటి తరానికి ఆ ఆనందాలు లేవు, ఆ అనుభూతులు వెతుక్కున్నా దొరకవు. ఎందుకంటే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి, అందులోనూ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళే అవకాశం లేదు. జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు దర్శకనిర్మాతలు ఎన్నిరకాల జిమ్మిక్కులు చేసినా అవి ప్రేక్షకుల ముందు పనిచేయడం లేదనేది వాస్తవం.
ఒకప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనం. అది కాస్తా రకరకాల మాధ్యమాల ద్వారా విస్తరించడంతో థియేటర్ల అవసరం లేకుండా పోయింది. ఎవరి వినోదం వారి చేతుల్లోనే ఉంటోంది. ఇప్పుడు మనుషులకు ప్రాణం ఎంత ముఖ్యమో వారి చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యం. ఎలాంటి వినోదం కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందు మెరుస్తుంది. అలాంటప్పుడు సగటు ప్రేక్షకుడు మరో ఆలోచన ఎందుకు చేస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు అని పదే పదే దర్శకనిర్మాతలు, హీరోలు ఎంత బాధపడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రేక్షకులు లేరు. అది ఒక స్టార్ హీరో సినిమా అయి వుండి, థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చెయ్యగలం అనే ఫీలింగ్ కలిగినపుడే అటువైపు దృష్టి సారిస్తున్నారు తప్ప ఓ మోస్తరు సినిమాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. స్టార్ హీరోల సినిమాలైనా మూడు, నాలుగు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుండడంతో కొంతమంది ఆ సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు.
సినిమాకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అనేది ఆలోచిస్తే.. ముఖ్యంగా పెరిగిన టిక్కెట్ ధరలు కనిపిస్తున్నాయి. ఒక ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యడానికి ఎంత ఖర్చవుతుంది అని ఆలోచిస్తే.. వారికి చుక్కలు కనిపిస్తాయి. ఆ సమయంలో కాస్త వివేకాన్ని ఉపయోగిస్తే మరో మూడు నాలుగు వారాల్లో ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది కదా. అప్పుడు కుటుంబసమేతంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇంట్లోనే చూడొచ్చు అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇందులో ప్రేక్షకుల్ని తప్పు పట్టడానికి వీలు లేదు. ఒకవిధంగా ఈ పరిస్థితి రావడానికి నిర్మాతలే కారణం అని దిల్‌రాజు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓటీటీ సంస్థలతో చేసుకునే అగ్రిమెంట్ ద్వారా థియేటర్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే పెద్ద సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక చిన్న సినిమా గురించి చెప్పక్కర్లేదు. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది.
సినిమాకి ఈ పరిస్థితి రావడానికి మేమే కారణం అని దిల్‌రాజు తన తప్పును ఒప్పుకుంటున్నారు. నాలుగు వారాల్లో సినిమా ఇంటికే వచ్చేస్తుంది. ఇంట్లోనే కూర్చొని హాయిగా చూడండి అని మేమే వారిని ఎంకరేజ్ చేశామని, తద్వారా వాళ్ళు థియేటర్‌కి రాకుండా చెడగొడుతున్నామని తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. సినిమాలను అలా ఓటీటీల వైపు మళ్లించడంలో నిర్మాతల స్వార్థం కూడా ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే ఎమౌంట్ ఎలా ఉన్నా, డిజిటల్ రైట్స్‌పై వచ్చే డబ్బుపైనే నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఓటీటీ వాళ్ళని ఎంతలా ఎట్రాక్ట్ చేస్తోందంటే.. స్టార్ హీరో సినిమా అయితే ఓపెనింగ్ రోజునే ఓటీటీకి సంబంధించిన అగ్రిమెంట్స్ జరిగిపోతున్నాయట. వాళ్ళు పెట్టే కండీషన్స్ అన్నింటికీ ఒప్పుకున్న తర్వాతే రైట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటప్పుడు థియేటర్స్‌కి ప్రేక్షకులు రావడం లేదు అని ఇప్పుడు బాధపడడంలో అర్థం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న ఓటీటీల ఒరవడి చూస్తుంటే.. భవిష్యత్తులో థియేటర్ అనేది ఒకటి ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |