![]() |
![]() |

తమిళ నటుడు తవసి సోమవారం రాత్రి మదురైలోని శరవణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లో కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతూ వచ్చారు. శరవణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. శరవణన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తవసి మృతి వార్తను పంచుకుంటూ తన సంతాపాన్ని వ్యక్తంచేశారు.
"నవంబర్ 11న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తవసి మా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరారు. అప్పటికే ఆయన కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉండటంతో పాటు ఫుడ్ పైప్‌తో ఉన్నారు. ఆయనను ఒక ప్రత్యేక గదిలో ఉంచి ఓసోఫజియల్ స్టంట్తో చికిత్స అందిస్తూ వచ్చాం. ఈ రోజు ఉదయం శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించాం. ఈరోజు రాత్రి సుమారు 8 గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబం, ఫ్రెండ్స్, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా" అని ఆయన రాసుకొచ్చారు.
కేన్సర్‌తో బాధపడుతున్న తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా అర్థిస్తూ తవసి విడుదల చేసిన వీడియో వైరల్ కావడంతో అప్పట్నుంచీ ఆయనకు ఉచితంగానే డాక్టర్ శరవణన్ చికిత్స అందిస్తూ వస్తున్నారు. రజనీకాంత్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ లాంటి స్టార్స్ తవసికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన కొద్ది రోజులకే తవసి తుదిశ్వాస విడవడంతో కోలీవుడ్ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తూ వస్తున్న తవసి చివరి సినిమా రజనీకాంత్ 'అన్నాత్తే'.
![]() |
![]() |