Home  »  News  »  మన కథానాయికల నోటిదూల

Updated : Jul 10, 2017

తాప్సీ ఈ మధ్య ‘పింక్’అనే సినిమాలో చేసింది. అమితాబ్ కీలక పాత్ర పోషించారు. సినిమా బాగా ఆడింది. ఆ సినిమా పుణ్యమా అని తాప్సీకి మంచి పేరు కూడా వచ్చింది. ఈ విజయంతో ‘ఇక  నేను మహానటిని అయిపోయా’అనుకుంటుందేమో..! నోటికి పెద్దా చిన్నా తారతమ్యం ఉండటం లేదు... ఈ ఢిల్లీ భామకి. 

ముఖాన రంగేసుకోవడమే అదృష్టంగా భావించే కళాకారులున్నారు. కెమెరా ముందు నిలబడటం అంటే... పూర్వజన్మ సుకృతమే అనుకునే నటీనటులు ఉన్నారు. అలాంటిది ఏకంగా హీరోయిన్నే చేసేశారు కె.రాఘవేంద్రరావు ఈ ముద్దుగుమ్మని. కానీ ఏ మాత్రం విశ్వాసం లేకుండా, కృతజ్నాతా భావం లేకుండా... కాస్తంత పేరు రాగానే.. ముంబాయ్ మీడియా ముందు దర్శకేంద్రుడ్ని చులక చేసి మాట్లాడేసింది తాప్సీ. నోటి దూల వీపుకు చేటు అని ఈ అందాల భామకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో. 

‘‘ఓ గొప్ప దర్శకుడున్నారు. శ్రీదేవి, జయప్రద లాంటి వారిని సూపర్ స్టార్లను చేసి ఘనుడు అయన. హీరోయిన్లను అందంగా చూపించడంలో ఘనాపాటి అనే పేరు కూడా ఉందాయనకు. పాటల్లో హీరోయిన్ల బొడ్డులపై  పూలు, పళ్లు వేయడం ఆయన స్టైల్. ఆ దర్శకుడు 105వ సినిమాలో నేను హీరోయిన్ గా నటించాను(‘ఝుమ్మంది నాదం’.. అది ఆమె మొదటి సినిమా). నాపై కూడా పూలు, పళ్లు వేస్తారనుకున్నాను. కానీ ఏకంగా నా బంప్ పై కొబ్బరి చిప్పతో కొట్టించారు. ఈ పూలు, పళ్లు, కొబ్బరి చిప్పలు స్త్రీల సౌందర్యాన్నీ, శృంగారాన్నీ ఏ విధంగా ప్రతిబింబిస్తాయో నాకైతే అర్థం కాదు’’అంటూ.. వెకిలి నవ్వులు నవ్వుతూ, మైకు ముందు చెలరేగిపోయింది తాప్సీ. ఉన్నత విద్యావంతురైనా తాప్సీ ఈ విధంగా ప్రవర్తించడం ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీసింది. సినిమా అనేది కళాత్మక ప్రక్రియ. ఎవరి స్టైల్ వారికుంటుంది. ఆ మాత్రం లాజిక్ తాప్సీకి తెలియకపోవడం నిజంగా బాధాకరం. 

మూడ్నాలుగేళ్ల క్రితం మన నిత్యామీనన్ కూడా ఇలాగే నోటి దూలతో మాట్లాడి ఫ్యాన్స్ తిట్లకు బలైపోయింది. మీకు గుర్తుందో లేదో.. ఓ గ్రూప్ ఇంటర్వ్యూలో ‘అవకాశం వస్తే ప్రభాస్ తో నటిస్తారా?’అని ఓ విలేకరి ప్రశ్నిస్తే... ‘ప్రభాసా?.. ఆయన ఎవరు? నాకు తెలీదే!’ అని ఎదురు ప్రశ్నలేసి.. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపారు నిత్యా. తత్పరిణామంగా ఫ్యాన్స్ కి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. 
 
చిత్ర పరిశ్రమలో కథానాయికలు ఎదుర్కొంటున్న  కష్టాల గురించీ, అవమానాల గురించీ స్పందించడం తప్పు కాదు. అలా స్పందించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు రాధికా ఆప్టేనే తీసుకోండి.  తనతో ఎంజాయ్ చేస్తే.. సినిమా అవకాశాం ఇస్తానని ఓ హీరో ప్రపోజల్ పెట్టాడని మీడియా ముందు డేర్ గా చెప్పేశారామె. దాంతో భుజాలు తడుముకోవడం చాలామంది దర్శక, నిర్మాతల వంతైంది.
 
ఇక సమంత అయితే ఇలాగే... నోటికి పనిచెప్పి, విచిత్రమైన పరిస్థితినే ఎదుర్కొంది.  మహేశ్ ‘నంబర్ వన్’ సినిమా పోస్టర్ పై అప్పట్లో ట్విట్టర్ ద్వారా యుద్ధం ప్రకటించిందామె. ‘హీరో వెనకాల కుక్కపిల్లలా పాకుతూ వెళుతున్న హీరోయిన్’ స్టిల్ చూసి ‘ఇదెక్కడి సంస్కారం.. మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా’అని దర్శకుడిపై అంతెత్తున లేచింది. అవకాశాలు పోతాయని కూడా ఆలోచించ లేదు. మహేశ్ తో అప్పటికే రెండు సినిమాల్లో చేసిన సమంత... మహేశ్ సినిమా పైనే విమర్శలు గుప్పించడం అప్పట్లో పెద్ద చర్చయ్యింది. అయితే... ‘చెప్పేటందుకె నీతులు ఉన్నాయి’ అన్నట్లూ... ఇంత గొడవ చేసీ, ఆ తర్వాత ‘సింకిందర్’అనే సినిమాలోని బీచ్ సాంగ్ లో టూపీస్ బికినీ వేసి తమిళ హీరో సూర్యాతో చెలరేగిపోయి నటించింది సమంత. ఇక మహేశ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?... ‘ఇదెక్కడి న్యాయం 


బుల్లెమ్మా... మహిళవై ఉండి ఇలాంటి పాటల్లో చేయొచ్చా’ అంటూ సమంతకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. అయితే... ఇదంతా ఒక వెర్షనే. వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూడా... ఇక్కడి మనుషులను ఓన్ చేసుకొని, మర్యాద, ఇచ్చిపుచ్చుకొని విజయవంతంగా కెరీర్ సాగిస్తున్న హీరోయిన్లకి కూడా ఇక్కడ కొదవేం లేదు. ఆ లిస్ట్ చెప్పాలంటే చాలానే ఉంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.