Home  »  News  »  ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది!

Updated : Dec 29, 2021

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'అర్జున ఫ‌ల్గుణ‌'. 'జోహార్' ఫేమ్ తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఏడాది 'గాలి సంపత్', 'రాజ రాజ చోర' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది చివరి రోజున 'అర్జున ఫ‌ల్గుణ‌'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు తాజాగా మీడియాతో ముచ్చటించాడు.

షాక్ ఇచ్చాడు
ఈ ఏడాదిలో నాకు ఇది మూడో చిత్రం. కొత్త దర్శకులనే నేను ఎంచుకుంటూ వచ్చాను. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నన్ను తేజ కలిసినప్పుడు జోహార్ సినిమా ఇంకా రాలేదు. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు నేను చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా అనిపించింది. తేజ ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కౌట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు.

అందరూ హీరోలే
డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. రంగస్థలం మహేష్, చైతన్య, రాజావారు రాణివారు చౌదరి, నేను, అమృతా అయ్యర్ మేం ఐదుగురం ఉంటాం. ప్రతీ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. తేజ అందరి దగ్గరికి వెళ్లి మీరే హీరో అని చెప్పినట్టున్నాడు. ప్రతీ ఒక్కరు హీరోలా ఇరగ్గొట్టేశారు.

ట్రైలర్ అలా కట్ చేశాం
గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ కారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను.

ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం
తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎంతో పాజిటివ్‌గా ఉంటుంది.

నర్సీపట్నం ఘటనల ఆధారంగా..
యథార్థ సంఘటనలే కానీ దాన్ని గోదావరి జిల్లాకు అడాప్ట్ చేశాం. నర్సీపట్నంలో జరిగిన ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తీశాం.

తెలుసుకునే ప్రయత్నం చేస్తారు..
తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో పెట్టేందుకే నేను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను..
నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం. నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం. 

నాకు చాలా సిగ్గు..
నాకు చాలా మొహమాటం. కానీ క్లోజ్ అయితే చాలా దూరం వెళ్తాను. నా డైరెక్షన్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా అందరి మీద చేతులు వేసుకుని మాట్లాడుతాను. కెమెరా ముందు పోజులు పెట్టాలంటే కూడా నాకు చాలా సిగ్గు. ఓ అరవై రోజులు ఒకే చోట ఉంటాం కాబట్టి అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తాను.

మంచి యాక్షన్ డ్రామా..
భళా తందనాన అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.