![]() |
![]() |
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటున్న త్రివిక్రమ్ ఒకప్పుడు రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేశాడు. కె.విజయభాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు వంటి సూపర్‌హిట్ సినిమాలకు కథ, మాటలు అందించాడు. అలాగే రాంప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరునవ్వుతో’, ఆర్.ఆర్. షిండే రూపొందించిన ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రాలకు కథ, మాటలు అందించాడు. 2002లో నిర్మాత స్రవంతి రవికిషోర్ ‘నువ్వే నువ్వే’ చిత్రంతో త్రివిక్రమ్‌ను దర్శకుడ్ని చేశాడు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా పలు చిత్రాలు కథ, మాటలు అందించడం విశేషం. రచయితగా వున్న తనను దర్శకుడ్ని చేసిన స్రవంతి రవికిషోర్‌పై త్రివిక్రమ్ కృతజ్ఞతా భావం ఉంది. అందుకే అనేక సార్లు రవికిషోర్ గురించి ప్రస్తావించాడు. రామ్ పోతినేని హీరో అయిన తర్వాత ఓ సందర్భంలో రవికిషోర్ బేనర్‌లో రామ్ హీరోగా ఒక సినిమా చేస్తానని ప్రకటించాడు త్రివిక్రమ్. అప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్.. రామ్‌తో ప్రకటించిన సినిమాను భవిష్యత్తులోనైనా చేస్తాడనే నమ్మకం రవికిషోర్‌కి వుంది. రామ్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం గురించి ఇటీవల స్రవంతి రవికిషోర్ స్పందిస్తూ ‘‘రామ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చెయ్యాలని నాకూ ఉంది. అయితే మా శ్రీను ముందు చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చెయ్యాల్సిన బాధ్యత అతనికి వుంది. రామ్ కోసం ఈ స్క్రిప్ట్ అయితే బాగుంటుంది అని ఆయన తీసుకుని వస్తే తప్పకుండా సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉన్నాం. ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను’’ అన్నారు. రవికిషోర్ మాటల్ని బట్టి రామ్‌తో సినిమా ఎప్పుడు చెయ్యాలనుకుంటే అప్పుడు చెయ్యమని పూర్తి బాధ్యత త్రివిక్రమ్‌కే అప్పగించినట్టు అర్థమవుతోంది. రామ్‌తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులోనైనా చెయ్యాలి. త్రివిక్రమ్‌కి ఇప్పుడున్న కమిట్‌మెంట్స్‌ను పక్కన పెట్టి రామ్‌తో సినిమా చేసే పరిస్థితి లేదు. మరి ఈ విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని రవికిషోర్‌తోపాటు రామ్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |