![]() |
![]() |

గురువారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలు తిరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన వెలువరించడంతో అశేష బాలు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అప్పట్నుంచే అందరిలోనూ ఆయన తిరిగి మన మధ్యకు వస్తారా, రారా.. అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ ముందు రోజు ఆయనకు జ్వరం వచ్చి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారనీ బాలు కుటుంబ సన్నిహితులు తెలిపారు. యాభై రోజుల పాటు కరోనాతో పోరాడి అలసిపోయిన బాలు శుక్రవారం మధ్యాహ్నం శాశ్వతంగా సెలవుతీసుకున్నారు. ఆయన గొంతు శాశ్వతంగా మూగబోయింది. బాలు మృతివార్తను స్వయంగా ఆయన తనయుడు చరణ్ ప్రకటించారు.
ఎంజీఎం హాస్పిటల్ ముందు కిక్కిరిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చరణ్, "నాన్నగారు ఈ రోజు మధ్యాహ్నం 1.04 గంటలకు స్వర్గీయులయ్యారు. ఆయన కోసం ప్రార్థించిన అందరికీ, ఎంజీఎం హాస్పిటల్‌లోని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరికీ మా కుటుంబం ఎప్పటికీ కృతజ్ఞులం. అభిమానులున్నంత వరకూ మా నాన్నగారు మాకుంటారు. మీరందరూ ఉన్నంతవరకూ మా నాన్నగారి పాట ఉంటుంది." అని ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీష్ భాషల్లోనూ బాలు మరణ వార్తను ఆయన తెలిపారు. ఈ విషయం ప్రకటించేటప్పుడు దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది.
![]() |
![]() |