![]() |
![]() |
పాత తరం హీరోలలో శోభన్‌బాబుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన అందంతో, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న శోభన్‌బాబుకు అప్పట్లో అభిమానులు కూడా ఎక్కువే. సినిమా పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా అందరి మనన్ననలు పొందిన శోభన్‌బాబు అంటే సినిమా తారలకు సైతం ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇటీవల ఎఐ టెక్నాలజీ సాయంతో శోభన్‌బాబు వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు. శోభన్‌బాబు మళ్లీ పుట్టాడు, సోగ్గాడు తిరిగొచ్చాడు అంటూ కామెంట్స్ పెడుతూ ఆ వీడియోను వైరల్ చేశారు. ఆ తర్వాత శోభన్‌బాబుకి సంబంధించినవే మరికొన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. నిన్నటితరం హీరోయిన్లలో ఒకరైన సుహాసిని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభన్‌బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నేను నాగార్జునగారితో ఒక సినిమా, వెంకటేశ్‌గారితో ఒక సినిమా చేశాను. అయితే చిరంజీవిగారితో, బాలకృష్ణగారితో ఎక్కువ సినిమాలు చేశానని అందరూ అనుకుంటారు. నిజానికి నేను ఎక్కువ సినిమాలు చేసింది శోభన్‌బాబుగారితోనే. ఆయనతో దాదాపు 15 సినిమాలు చేశాను. భార్యాభర్తలు, బావామరదళ్లు, మహారాజు కొంగుముడి, జాకీ.. ఇలా మంచి హిట్ సినిమాలు చేశాను. ఆయనతో కలిసి నటించడం ఓ మధురానుభూతిని కలిగించింది. షూటింగ్ టైమ్‌లో ఎంతో సరదాగా ఉండేవారు. ఈ జనరేషన్‌లో కనుక శోభన్‌బాబుగారు ఉంటే ఎలా ఉండేవారు అనే ఊహతో ఎఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన ఓ వీడియో ఇటీవల చూశాను. ఆ వీడియో చూడగానే నా కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే అలాగే ఉండేవారేమో అన్నంత సహజంగా ఆ వీడియో ఉంది. మంచి వ్యక్తిత్వం ఉన్న అలాంటి హీరోతో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం’ అన్నారు.
![]() |
![]() |