Home

»

Latest News

అరుదైన వ్యాధి మయోసైటిస్‌కు సమంత ఎలా గురైంది?

Oct 31, 2022 3:38PM

 

మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో తను బాధపడుతున్నట్లు, త్వరలో దాన్నుంచి బయటపడి ఆరోగ్యవంతురాలిని అవుతానంటూ రెండు రోజుల క్రితం సమంత వెల్లడించడం ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఆందోళనకు గురిచేసింది. సమంత టైటిల్ రోల్ చేసిన 'యశోద' మూవీ నవంబర్ 11న థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తన ఆరోగ్యం బాగా లేకపోయినా చేతికి సెలైన్ ఉంచుకొన్న స్థితిలోనే తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పిందామె. ఆ సందర్భంగా తీయించుకొన్న ఫొటోనే ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, తను ఎదుర్కొంటున్న జబ్బు గురించి బయటి ప్రపంచానికి తెలిపింది సమంత. 

ఆమె పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పెడుతూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. "నువ్వు ఎక్కువ అంత‌ర్గ‌త బ‌లంతో ఉన్న అద్భుత‌మైన అమ్మాయివి. ఈ ఛాలెంజ్‌ను కూడా త్వ‌ర‌లో నువ్వు క‌చ్చితంగా దాటేస్తావ‌ని నేను అనుకుంటున్నాను. దేవుడు నీకు తోడుగా ఉండుగాక" అని ట్వీట్ చేశారు చిరు. సమంత మాజీ భర్త నాగచైతన్య స్పందించలేదు కానీ, అఖిల్ రెస్పాండ్ అయ్యాడు. "ఆల్ ద లవ్ అండ్ స్ట్రెంగ్త్ టు యు డియర్ సాం" అని అతను పోస్ట్ చేశాడు.

కాగా సమంతకు అసలు ఈ డిజార్డర్ ఎందుకు వచ్చి ఉంటుందని ఆమె అభిమానులతో పాటు పలువురు ఆరాలు తీస్తున్నారు. వర్కవుట్స్ ఎక్కువగా చేసినప్పుడు కండరాలు గాయపడతాయనీ, దానివల్ల మయోసైటిస్ రావచ్చనీ డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒంట్లో కొలెస్టరాల్‌ను తగ్గైంచుకోవడానికి వాడే మెడిసిన్స్ వల్ల, జలుబు లాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వల్లా, కొవిడ్ వల్ల కూడా మయోసైటిస్ వచ్చే అవకాశం ఉంది. మయోసైటిస్‌కు గురైతే, మనలోని నిరోధక శక్తి కండరాల మీద దాడి చేస్తుంది. ఫలితంగా కండరాల నొప్పులు తీవ్రమవుతాయి. మయోసైటిస్‌లో ప్రధానంగా మూడు రకాలైనవి ఉంటాయి. అవేమిటంటే.. డెర్మటోమయోసైటిస్, పాలీమయోసైటిస్, బాడీ మయోసైటిస్. వీటిలో సమంతకు సోకిన మయోసైటిస్ ఏ రకానికి చెందిందనే విషయం వెల్లడి కాలేదు. 

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కోసం సమంత ఫైట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఆ సందర్భంగా విపరీతంగా వర్కవుట్స్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అప్పట్లో ఆమె షేర్ చేసింది. ఆ తర్వాత కూడా ఆమె వర్కవుట్స్ ఎక్కువగా చేస్తూనే వచ్చింది. దీనివల్లే ఆమె మయోసైటిస్ బారిన పడివుంటుందని పలువురు ఊహిస్తున్నారు. కొంతమందైతే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందనీ, ఇది ఆమె ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపించి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలు, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ, మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఏదేమైనా మయోసైటిస్ అనే అరుదైన డిజార్డర్‌కు గురైన సమంత త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు, ఆమెతో కలిసి పనిచేసినవాళ్లు తమ సందేశాలతో ఆమెకు మానసిక బలాన్ని ఇచ్చారు. వారిలో జూనియర్ ఎన్టీఆర్, నాని, దుల్కర్ సల్మాన్, కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, రాం పోతినేని, వంశీ పైడిపల్లి, సాయిధరం తేజ్, సందీప్ కిషన్, సుశాంత్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ అండ్ డీకే సహా పలువురు ఉన్నారు.  

మరోవైపు మయోసైటిస్ కారణంగా నిస్సత్తువతో ఉన్న సమంతను 'యశోద' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిందిగా ఇబ్బంది పెట్టవద్దని నిర్మాత దర్శకుల్ని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంత తనకు ఎదురైన ఆరోగ్య సమస్య నుంచి త్వరలోనే కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని తెలుగువన్ కోరుకుంటోంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com