![]() |
![]() |

ఇటీవల తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 'బలగం' తర్వాత ఈ తరహా సినిమాలకు క్రేజ్ పెరిగింది. అదే బాటలో పయనిస్తూ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'రామన్న యూత్'. విలేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ నేడు(సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నటుడు, 'పెళ్లిచూపులు' ఫేమ్ అభయ్ నవీన్ దర్శకుడిగా పరిచయం కావడం విశేషం.
నాయకులు సీజన్ కి ఒక పార్టీ మారుతూ, ఆస్తులు పోగేసుకుంటుంటే.. పార్టీని, నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం జెండాలు మోస్తూ జీవితాలను నాశనం చేసుకుంటారు. అలాంటి కార్యకర్త కథే ఇది. ఊరిలో స్నేహితులతో కలిసి తిరిగే రాజు(అభయ్ నవీన్)కి రాజకీయాలన్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యే రామన్న(శ్రీకాంత్ అయ్యంగర్) అన్నా ఎంతో అభిమానం. ఎమ్మెల్యే వెంట తిరిగి ఎలాగైనా తాను కూడా నాయకుడిగా ఎదగాలని కలలు కంటుంటాడు. ఆ ఊరిలోని యువ నాయకుడు అనిల్(తాగుబోతు రమేష్) వెంట తిరుగుతూ.. ఎమ్మెల్యేని చేరాలనుకుంటాడు. అయితే ఓ ఫ్లెక్సీ కారణంగా రాజు గ్యాంగ్ కి, అనిల్ తమ్ముడికి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో అనిల్ కి దూరమైన రాజు.. అతని సాయం లేకుండానే ఎమ్మెల్యేని కలుస్తానని అనిల్ తమ్ముడితో ఛాలెంజ్ చేస్తాడు. ఎమ్మెల్యేని కలవడానికి బయల్దేరిన రాజుకి, అతని స్నేహితులకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?, సిద్ధిపేటకు బయల్దేరిన వాళ్ళు, హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జైలుపాలు ఎందుకయ్యారు? ఈ ప్రయాణంలో రాజు గ్యాంగ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? అనేది మిగిలిన కథ.
దర్శకుడు అభయ్ నవీన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. పార్టీలు, నాయకులు అంటూ జెండాలు మోస్తూ తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్న కొందరు మధ్యతరగతి యువకులకు కళ్ళు తెరిపించేలా ఉంది. అయితే ఆ పాయింట్ ని తెరమీదకు ఆసక్తికరంగా తీసుకురావడంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యాడు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. ఆ కాన్సెప్ట్ కి తగ్గట్లుగా బలమైన కథాకథనాలు తోడైతే సినిమా బెటర్ గా ఉండేది. సినిమా చిత్రీకరణ సహజంగా ఉంది. వినోదం కూడా బాగానే పండింది. అయితే ఎమోషన్స్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. దర్శకుడిగా అభయ్ నవీన్ పరవాలేదు అనిపించుకున్నాడు. అతనికి పలు విభాగాల మీద బాగానే అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే సినిమాకి ఆయువు పట్టు అయిన కథాకథనాల మీద అతను ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే దర్శకుడిగా రాణించగలడు. మొత్తానికి 'రామన్న యూత్' చిత్రాన్ని కాన్సెప్ట్ కోసం, కొన్ని ఆలోచింపచేసే సన్నివేశాల కోసం, యువ ప్రతిభ చేసిన ప్రయత్నం కోసం ఒక్కసారి చూడొచ్చు.
![]() |
![]() |