![]() |
![]() |

ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్య వినాయకం ఆదివారం (డిసెంబర్ 26) రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా ఆయన చికిత్స పొందుతూ వస్తున్నారు. 78 ఏళ్ల ఆ గాయకుడు నిన్న గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. మాణిక్య వినాయకం మరణం కోలీవుడ్‌ను విషాదంలోకి నెట్టేసింది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి నివాళులర్పించారు.
మాణిక్య వినాయకం అంత్యక్రియలు ఈరోజు ఉదయం చెన్నైలో ఆయన ఇంటిలో జరిగింది. కాగా.. అభిమానులు, సినీ రంగానికి చెందిన పలువురు ఆయనతో తాము గడిపిన ఇష్టమైన క్షణాలను, ఆయన పాడిన మంచి పాటలను, ఆయన నటించిన సినిమాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
విక్రమ్ నటించిన 'దిల్' సినిమాలో పాడిన "కన్నుక్కుల్ల గెలతి" అనే పాటతో మాణిక్య వినాయకం గాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఆయన 800కు పైగా సినిమా పాటలను ఆలపించారు. వాటితో పాటు మరో 800 భక్తి పాటలు, జానపద పాటలను పాడారు. తన సుమధుర గాత్రం, స్నేహపూర్వక స్వభావంతో ఎంతోమంది ఔత్సాహిక గాయకులకు ఆయన ప్రేరణగా నిలిచారు.
పలు తమిళ సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు మాణిక్య వినాయకం. ధనుష్ 'తిరుడా తిరుడి', విశాల్ 'తిమురు', విజయ్ 'వేట్టైకారన్' లాంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
![]() |
![]() |