Home  »  News  »  సినిమా టికెట్ల ధ‌ర‌లపై వ‌ర్మ ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పేర్ని నాని జ‌వాబులు!

Updated : Jan 5, 2022

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం నియంత్రించ‌డం, దేశంలో ఎక్క‌డాలేని విధంగా అతి త‌క్కువ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించ‌డం వివాదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే. సినిమా థియేట‌ర్ల‌పై, సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వ జోక్యం ఏమిటంటూ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ రెండు రోజులుగా వ‌రుస ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ వ‌స్తున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్న‌లు సంధించారు. వీటికి ఈరోజు నాని స్పందించారు. ఆర్జీవీ ప్ర‌శ్న‌ల‌కు వ‌రుస‌గా జ‌వాబులు ఇస్తూ ట్వీట్లు చేశారు.

"గౌరవనీయులైన రామ్‌గోపాల్ వ‌ర్మ గారూ.. మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?" అంటూ త‌న రిప్లై ట్వీట్ల‌ను స్టార్ట్ చేశారు. "సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి." అని ఆయ‌న చెప్పారు.

Also read: టాక్ ఆఫ్ ద టౌన్‌: 'పుష్ప‌'పై మ‌హేశ్ ట్వీట్‌.. బ‌న్నీ రిప్లై!

పేర్ని నాని చేసిన ట్వీట్లు..
"ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు."

"బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ?  కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ."

Also read: ఏపీలో పేదల కోసం రేషన్ థియేటర్స్!

"సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు రామ్‌గోపాల్ వ‌ర్మ గారూ."

"హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు వ‌ర్మ గారూ. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి." 

Also read: శివ పార్వతిలో 'టక్కరి దొంగ' మూవీ ఫస్ట్ డే చూశా.. ఇలా జరగడం బాధాకరం!

"ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు."

"మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?"

Also read: ​'రామ్ గోపాల్ వర్మ' లాంటి మేధావి 'బాబా'గా మారితే?

వ‌ర్మ ప్ర‌శ్న‌ల‌కు నాని ఇచ్చిన జ‌వాబులు చాలా పేల‌వంగా ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నాని జ‌వాబుల‌కు వ‌ర్మ మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు సంధించ‌డం త‌థ్య‌మ‌నీ, అవి ఏ తీరులో ఉంటాయో చూడాల‌నీ నెటిజ‌న్లు, ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు."






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.