Home  »  News  »  ఓపెన్‌ అయిపోయిన పవన్‌ కళ్యాణ్‌.. సినిమా గురించి ఏం చెప్పాడులే!

Updated : Jul 23, 2025

* ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు  వస్తున్న గొప్ప చిత్రం ఇది 
* చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం
* శ్రీ కీరవాణి గారి అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది 
* ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి... అన్నం పెట్టిన కర్మభూమి 
* హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం
* చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా
* నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి చక్కగా ఉపయోగపడ్డాయి 
* హరిహర వీరమల్లు తప్పనిసరిగా గొప్ప చిత్రంగా విజయవంతం అవుతుంది 
* విశాఖలో జరిగిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ - 2 లో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు  

ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని పరిరక్షించడానికి ఒక శక్తిపుడుతుంది. హిందువుగా జీవించాలి అంటే జిజియా పన్ను కట్టాలనే కంటక పాలకుడి నుంచి అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచిపోతుంది. చరిత్రలో కీలకమైన విషయాలు భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలని భావించి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాం. దాన్ని అత్యంత కఠినమైన పరిస్థితిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సగర్వంగా తీసుకురావడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్రకథ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వరుస పజయాలతో ఉన్న సమయంలో ఒక్క విజయం ఇవ్వమని దేవుడి ని ప్రార్థించానని, ఇప్పుడు కూడా తాను నమ్మే సరస్వతి దేవి... హరిహర వీరమల్లు చిత్రాన్ని కచ్చితంగా విజయవంతం చేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడుగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ - 2 ఈవెంట్ విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "విశాఖపట్నంతో నాకు విడదీయరాని బంధం ఉంది. నటనలో ఓనమాలు నేర్పింది ఈ ప్రాంతం. శ్రీ సత్యానంద్ గారి దగ్గరకు వచ్చే వరకు నాకు నటన అంటే ఏంటో తెలియదు. పది మంది మధ్యా మాట్లాడాలన్నా... స్వేచ్ఛగా భావాలు వ్యక్తపరచాలన్నా ఎంతో ఇబ్బంది పడేవాడిని. మనసులో చాలా ఆలోచనలు ఉండేవి కానీ గొంతు దాటి మాట బయటకు వచ్చేది కాదు. మా అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు... నాకు పెద్దగా కోరికలు ఉండేవి కాదు. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేయాలని మాత్రమే ఉండేది. ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాల్లోకి వచ్చి పెద్ద స్టార్ అయిపోవాలని, డబ్బులు సంపాదించాలని ఏనాడు లేదు. 
జీవిత పాఠాలు నేర్పించారు
యాక్టింగ్ ప్రారంభించిన తొలినాళ్లలో సత్యానంద్ గారిని ఎంతో ఇబ్బందిపెట్టేవాడిని. ఆయన ఎంతో కష్టపడి నటనలో మేళకువలు నేర్పుతుంటే ధ్యాస కుదిరేది కాదు.  లఈ రోజు కాదు రేపు... రేపు కాదు ఎల్లుండి అని దాటవేసేవాడిని. చెన్నైలో పని జరగడం లేదని గమనించిన ఆయన అన్నయ్య శ్రీ చిరంజీవి గారికి చెప్పి నన్ను విశాఖ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. సరస్వతి నమస్తుభ్యం శ్లోకంతో నటన మొదలుపెట్టిన నేను... రెండు నెలల్లోనే గంటన్నర స్టేజ్ ప్రదర్శన స్థాయికి తీసుకెళ్లారు. ఆయన దగ్గర నేను నటన కాదు ధైర్యం నేర్చుకున్నాను. అభిప్రాయాలను బాహాటంగా చెప్పడం నేర్చుకున్నాను. ఆయన నాకు నేర్పింది యాక్టింగ్ కాదు జీవిత పాఠాలు.  శ్రీ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారికి ఒకటే చెప్పాను. నేను సినిమాల్లో నటించకపోయినా ఫర్వాలేదు. నాకు జీవితంలో బతికే శక్తిని ఈ ట్రైనింగ్ ద్వారా దక్కింది అని చెప్పాను. ఆయన దగ్గర తీసుకున్న ట్రైనింగ్ వల్లే సినిమా మేకింగ్ పట్ల అవగాహన పెరిగింది. నన్ను మా అన్న, వదినలు ఎంత నమ్మారో... గురువుగారైన శ్రీ సత్యానంద్ గారు అంతే నమ్మారు. అందుకే ఆయనకు పాదాభివందనాలు చేశాను. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తరువాత నా శిరసు తీసుకెళ్లి అన్న,వదినల పాదాల వద్ద పెట్టాను. వాళ్లు నాకు కనిపించే దేవుళ్లు.   
నేను పవనం... వాళ్లు బావిలో కప్పలు
పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని  చెబుతాడని విమర్శిస్తుంటారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మేము ఉండాల్సి వచ్చింది. అందుకే అన్ని ఊర్ల పేర్లు చెబుతాను. నా పేరు పవనం... తిరుగుతూ ఉంటాను. మనల్ని విమర్శించే వాళ్లు కూపస్థ మండూకాలు.. అంటే బావిలో కప్పలు.  బావిలో ఒక గీరి గీసుకొని కూర్చొనే కప్పలకు ఏమీ తెలుస్తుంది పవనం తాలూకా శక్తి?  వాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవు.  
హోటల్లో నన్ను బంధిస్తే... తెల్లవార్లూ ప్రజలు హోటల్ ముందు నిలబడ్డారు
ఉత్తరాంధ్ర ఆటపాట్లే కాదు... ఇక్కడ జరిగిన ఎన్నో సంఘటనలు నాకు గుండెల్లో గుర్తుండిపోయాయి. రెండేళ్ల క్రితం జనవాణి కార్యక్రమం కోసం విశాఖకు వస్తే ఎన్నో ఆంక్షలు విధించారు. కారు నుంచి బయటకు రాకుండా చేశారు. హోటల్ ఉంటే రాత్రంతా భయబ్రాంతులకు గురి చేశారు. బూటు కాళ్లతో డోర్లను తన్నుతూ రెచ్చిపోయారు. నన్ను బలవంతంగా నిర్బంధిస్తే మొత్తం విశాఖ ప్రజానీకం తరలివచ్చి నోవోటెల్ ముందు కూర్చుంది. అంత బలమైన జ్ఞాపకాలు ఇచ్చింది విశాఖపట్నం. అందుకే ఈ ఫంక్షన్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించాను.  
మన సినిమా టికెట్ రూ.10 చేశారు
గత ప్రభుత్వ హయాంలో అందరి హీరోల సినిమాలకు ఒకలా టికెట్ల రేట్లు పెంచిన ప్రభుత్వం... పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం టికెట్ల రేటును రూ. 10కు తగ్గించేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బీమ్లా నాయక్ వంటి సినిమాను అభిమానులు విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్దే ఉన్నా... టికెట్ల రేట్లు పెంపు విషయంలో నాకు సంబంధం లేదు.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకోవాలని నిర్మాతకు చెప్పాను.  ఆయన కూడా అందరి హీరోలకు ఇచ్చినట్లు మా సినిమాకు కూడా రేట్లు పెంపునకు సహకరించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు... పవనన్న సినిమా మంచి విజయం సాధించాలని ట్విట్ చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అయ్యింది. ఏ రోజూ ఎవరినీ ఏదీ అడిగిన పాపాన పోలేదు. నాకు ఇవ్వడం తెలుసు కానీ అడగడం తెలియదు. మారుమూల గిరిజన గ్రామాలకు డోలీ మోతలు లేకుండా రోడ్లు వేయడం తెలుసు తప్ప నా కోసం ఇది చేయండి అని అడగడం తెలియదు. నేను అడగకపోయినా నా అభిమానులకు నాకు ఇస్తారని తెలుసు.
మా కష్టానికి తగ్గ ఫలం భగవంతుడు ఇవ్వాలి
మూల కథతో పాటు హరిహర వీరమల్లులో బలమైన భాగానికి శ్రీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టు నుంచి మధ్యలో పక్కకి వెళ్లిపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్న మంచి దర్శకులు ఆయన. శ్రీ క్రిష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ క్రిష్ గారి తర్వాత ప్రాజెక్టును శ్రీ ఎ.ఎం.రత్నం గారి కుమారుడు శ్రీ జ్యోతి కృష్ణ భుజాన వేసుకున్నారు. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న ఆయన ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో మార్పులు, చేర్పులు చేసి 2.34 గంటలు నిడివితో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా రికార్డుల గురించి నేను ఎప్పుడూ చెప్పను. సరస్వతీ దేవిని ప్రార్ధిస్తాను. శ్రీ కృష్ణుడు చెప్పిన.. కర్మ చెయ్యి, ఫలితం భగవంతుడికి వదిలేయ్ అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తాను. మేము పడిన కష్టానికి ఆ భగవంతుడు సత్ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
వీరమల్లు మీద అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వ్యక్తి... శ్రీ కీరవాణి గారు
నాకు సినిమా ఒక ప్యాషన్. ఒక నియంతృత్వ పోకడ కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొగలిగానంటే ఆ శక్తి, సంపద సినిమా, అభిమానులు ఇచ్చిందే. సినిమాకి కులం, మతం, ప్రాంతం, లింగ బేధాలు ఉండవు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. మేము ఇక్కడ నుంచి వచ్చాము. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అంతా ప్రేక్షకులకు ఆనందం కలిగించాలనే చూస్తాం. నాకు ఈ చిత్రం సరిగా వస్తుందా? రాదా? అన్న సందేహం ఉండేది. నేనే సందేహించిన ప్రతిసారీ ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసే వారు. ఆ ట్రైలర్ లో మ్యూజిక్ తో ఎప్పటికప్పుడు మా ఆశలకు జీవం పోసేవారు. హరిహర వీరమల్లు మీద మా అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎం.ఎం. కీరవాణి గారు. శ్రీ కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు సినిమా లేదు. మేము ఎంత బాగా నటించినా ఆ ఎమోషన్స్ ముందుకు తీసుకువెళ్లే సంగీతం లేకపోతే సన్నివేశాల్లో జీవం ఉండదు. నాటు నాటు అని ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందంటే నమ్ముతామా? శ్రీ కీరవాణి గారు సాధించిన ఘనతకు భారతీయులుగా మనమంతా గర్వించాలి.
ధర్మం జోలికి వస్తే తాటతీస్తామని చూపిస్తాం
ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మాటలు ఉండవు అంతా యాక్షనే. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తాం అని చూపిస్తాం. వీరమల్లు రెండు భాగాలు అయ్యింది. మొదటి భాగం ఎలా ముగించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చరిత్ర మనందరికీ తెలిసేలా ముగించాలి అనుకున్నాం. సినిమా అంటే థియెటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆనందింప చేయాలి. నేను మాత్రం ఎంటర్ టైన్మెంట్ తోపాటు ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటా. మన కృష్ణా నది తీరాన కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం గోల్కొండ నవాబ్ చేతికి వెళ్తే, అక్కడి నుంచి మొఘలులకు చేరి, ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. స్టోరీలో కోహినూర్ ని దొంగిలించడం అనే ఆలోచన నాకు నచ్చింది. ప్రజా కంటకుడైన పాలకుడు ఔరంగజేబు కూర్చున్న నెమలి సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రం దొంగిలించి వెనక్కి తీసుకురావాలి అన్న కులీ కుతుబ్షా ఆదేశంతో హరిహర వీరమల్లు అనే కల్పిత పాత్ర ప్రారంభం అవుతుంది. కథ కొల్లూరు నుంచి గొల్కొండ, ఢిల్లీ వరకు పోతుంది. మొదటి భాగం ఎర్రకోట వద్ద ఆగుతుంది. వీరమల్లు ఔరంగజేబు కలుసుకున్నారా? తదుపరి ఏం జరుగుతుంది అనేది రెండో భాగం. 
అన్ని ధర్మాలను ఐక్యం చేసేదే సనాతన ధర్మం
సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మం క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు. ఇస్లాంకి వ్యతిరేకం కాదు. అన్ని ధర్మాలను ఐక్యం చేసేదే సనాతన ధర్మం. ఔరంగజేబు లాంటి వాళ్ళ పాలనలో హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను చెల్లించాలి. నేను ఏ పాలకుడికీ వ్యతిరేకం కాదు. తప్పులు జరిగినప్పుడు దాన్ని తెలియజేయాలి. చాళుక్యులు, పాండ్య రాజులు. విజయనగర రాజుల గురించి మనకు పెద్దగా తెలియదు. మన చరిత్ర పుస్తకాలు మొఘలుల గురించి ఘనంగా చెప్పాయి.  మిగిలిన రాజుల గురించి తక్కువ చెబుతాయి. కోహినూర్ తెచ్చే ప్రక్రియలో హీరో జిజియా పన్ను కట్టాల్సి వస్తుంది. ఆ పన్ను కట్టే సమయంలో యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. యుద్ధంలో పాల్గొనాలని లేకపోయినా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? కోహినూర్ వజ్రాన్ని కనుగునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మొదటి భాగం. బలమైన మనసుతో పాటు శరీరం ఉండాలని నేను నమ్ముతాను. అందుకే రెగ్యులర్ గా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ అనుభవంతో చివరి సన్నివేశాలు 18 నిమిషాలు నేనే దర్శకత్వం వహించాను. యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం రియలస్టిక్ గా చేశాం. దానికి శ్రీ కీరవాణి గారు అందించిన మ్యూజిక్ రోమాలు నిక్క బొడిచేలా చేస్తాయి. గతంలో మా అభిమానుల కోసం ఒక మంచి హిట్ ఇవ్వమని గబ్బర్ సింగ్ సమయంలో భగవంతుడిని కోరుకున్నా. నేను నటనలో ఓనమాలు దిద్దుకున్న నేల విశాఖ నుంచి అభిమానులంతా ఆనందించే విజయాన్ని ఇవ్వమని ఆ సరస్వతీ దేవిని కోరుకుంటున్నాను"  అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.