![]() |
![]() |
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రకింగ్ స్టార్ యశ్ తన పవర్‌ను మరోసారి నిరూపించుకున్నారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ‘టాక్సిక్’ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు వచ్చిన ట్రోల్స్, విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా తొలిరోజు భారతీయ నెట్ కలెక్షన్లను ‘టాక్సిక్’ కేవలం బుధవారం మధ్యాహ్నానికే అధిగమించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా ఓనం పండుగ సెలవును పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రానికి ఉదయం ఆటల నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం సమయానికే భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 31.76 కోట్ల నెట్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే సుమారు రూ. 37.48 కోట్లకు పైగా నమోదయ్యాయి. కన్నడ వెర్షన్ ఏకంగా 77 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేయగా, తెలుగు వెర్షన్ కూడా 57 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది.
కాగా, గతంలో విడుదలైన రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం తొలిరోజు భారత్‌లో రూ. 28.60 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించగా, యశ్ క్రేజ్ ముందు ఆ మార్కు మధ్యాహ్నానికే తుడిచిపెట్టుకుపోయింది. గ్లోబల్ వైడ్‌గా 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు రూ. 85 కోట్ల ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం.
‘కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి సంచలన విజయం తర్వాత యశ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ తన మాస్ అండ్ స్టైలిష్ లుక్‌తో అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్, మేకింగ్ వాల్యూస్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలోనూ ‘టాక్సిక్’ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. యశ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తూ రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట హోరెత్తిస్తున్నారు. మొదటి రోజు టాక్ చూస్తుంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్య ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అదే కనుక నిజమైతే ‘కేజీఎఫ్ 2’ తర్వాత వంద కోట్ల ఓపెనింగ్ సాధించిన రెండో కన్నడ చిత్రంగా ‘టాక్సిక్’ నిలవనుంది.
[Yash Toxic Box Office Collection, Toxic Movie First Day Collections, Yash Toxic vs Dhurandhar Ranveer Singh, Yash Next Movie Collections, TeluguOne Entertainment News]
![]() |
![]() |