![]() |
![]() |
మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన కథాంశాలకు, పిరియాడికల్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు టోవినో థామస్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పళ్లిచట్టంబి'. ఈ ఏడాది ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జులై 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'సోనీలివ్' లో ఏకంగా 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో, 1950 - 1960ల కాలంనాటి కేరళ నేపథ్యాన్ని ఎలా ఆవిష్కరించిందో వివరంగా తెలుసుకుందాం.
ఈ కథ అంతా కేరళలోని 'తరియెట్టమల' అనే పర్వత ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఆ కొండల చుట్టూ అనేక గిరిజన గూడాలు ఉన్నప్పటికీ, ఎవరూ కూడా ఆ పర్వతం వైపు వెళ్లడానికి సాహసించరు. అది ఒక 'పిశాచి భూమి' అనే తీవ్రమైన భయం అక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. దాంతో ఆ ప్రాంతం గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పర్వత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామే 'కణియార్'. ఆ సమయంలో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడంతో, తమ భూములను ప్రభుత్వం లాగేస్తుందేమోననే భయం స్థానిక ప్రజల్లో మొదలవుతుంది. ఆందోళన చెందిన చర్చి ఫాదర్, తమ చర్చి ఆస్తులను, భూములను రక్షించుకోవడం కోసం ఒక భయం లేని బలవంతుడిని, రౌడీయిజం తెలిసిన వ్యక్తిని వెతకడం ప్రారంభిస్తారు.
ఈ క్రమంలోనే 'తోమాపురం' నుంచి కృష్ణ పిళ్లై (టోవినో థామస్)ను నెలకు నిర్దిష్ట జీతం ఇస్తామని ఒప్పించి, అతని పేరును 'క్రిస్టఫర్ పోతన్' గా మార్చి కణియార్‌కి తీసుకువస్తారు. ఊరిలో అడుగుపెట్టడమే లోకల్ రౌడీ జార్జ్‌ని ఓడించిన పోతన్, 'పళ్లిచట్టంబి' అంటే చర్చి తరఫున నిలబడే రౌడీగా గుర్తింపు పొందుతాడు. అయితే, వీధి నాటకాల ద్వారా కమ్యూనిజం సిద్ధాంతాలను ప్రచారం చేసే 'రెబెక్కా' (కయాదు లోహర్)తో పోతన్‌కు పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఆకర్షణలో పడిన పోతన్, ప్రచారాన్ని అడ్డుకోలేకపోతాడు. అసలు ఈ గొడవల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు, డబ్బు కోసం వచ్చిన పోతన్ తన ప్రేమికురాలి ఆశయం కోసం ఎలా మారాడు అనేది కథలోని మిగతా భాగం.
సాంకేతికంగా చూస్తే, 1950 - 60ల కాలంనాటి వాతావరణాన్ని విజువల్‌గా ఆవిష్కరించడంలో సినిమా విజయం సాధించింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం, 'ఇన్నినాళ్లు చూడలేదులే' అనే మెలోడీ పాట కథలోని ఎమోషన్ ని నిలబెట్టాయి. టిజో టోమీ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ కూర్పు సినిమాకు బలాన్నిచ్చాయి. టోవినో థామస్ నటన, కయాదు లోహర్ అందం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఐదుకి 2.50 రేటింగ్ లభించింది. నిదానంగా సాగే కథనం ఉన్నప్పటికీ, చారిత్రక సామాజిక పరిస్థితులను ఆస్వాదించే ఓటీటీ ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
Pallichattambi, Tovino Thomas
![]() |
![]() |