Home  »  News  »  షాకిచ్చిన డైరెక్టర్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు సినిమా కాదు.!

Updated : Jul 24, 2026

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో సూర్య కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో 'లక్కీ భాస్కర్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని జోరుమీదున్న వెంకీ అట్లూరి, ఈసారి ఏకంగా సూర్యతో జతకట్టడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

అయితే, తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా కాలంగా ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమని అనుకుంటుండగా.. వెంకీ అట్లూరి స్పందిస్తూ ఇది ఔట్ అండ్ ఔట్ తమిళ సినిమానే అని, తెలుగులోకి కేవలం డబ్ మాత్రమే చేశామని స్పష్టం చేశారు. గతంలో ధనుష్‌తో 'సార్ (వాతి)' సినిమా తీసినప్పుడు ద్విభాషా చిత్రంగా ఒకేసారి తెలుగు, తమిళాల్లో చిత్రీకరించే ప్రయోగం చేశామని, కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథా వస్తువు దృష్ట్యా ముందుగా తమిళంలోనే షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

సూర్యతో సినిమా చేయాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, భవిష్యత్తులో ఆయనతో ఖచ్చితంగా ఒక నేరుగా తెలుగు సినిమా చేస్తానని కూడా పేర్కొన్నారు. ఈ వార్త బయటకు రావడంతో టాలీవుడ్‌లోని సూర్య అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. 'తెలుగులో దత్తపుత్రుడిలా' ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సూర్య, తెలుగు దర్శకుడితో పని చేస్తూ కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.

 

 

Suriya, Viswanath and Sons, Venky Atluri, Mamitha Baiju

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.