![]() |
![]() |
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్లపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, సమంత ఆప్తమిత్రుడు రాజ్ నిడిమోరు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడుదలకంటే ముందు ఇండస్ట్రీలో చాలా మంది సమంత మార్కెట్ స్టామినాను, ఆమె పొటెన్షియల్‌ను చాలా తక్కువ అంచనా వేశారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఒక నిర్మాత ఇండస్ట్రీ వర్గాల్లో ఈ చిత్రం బజ్ గురించి ఆరా తీశారని గుర్తు చేసుకున్నారు. దానికి అవతలి వ్యక్తి.. "మహిళా ప్రధాన చిత్రాలకు ముందేం బజ్ ఉంటుంది? టాక్ బాగుంటేనే థియేటర్లకు జనాలు వస్తారు" అంటూ చాలా తేలికగా మాట్లాడారని రాజ్ తెలిపారు. ఆ మాటలు విన్నప్పుడు తాము కూడా కాస్త నిరుత్సాహపడ్డామని, కానీ మొదటి రోజు బాక్సాఫీస్ ఓపెనింగ్స్ చూశాక అందరి మైండ్ బ్లాక్ అయిందని ఆయన నవ్వుతూ చెప్పారు.
సినిమా అంటే సినిమానే.. అది హీరోదైనా, హీరోయిన్‌దైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ నిరూపించాయని రాజ్ నిడిమోరు స్పష్టం చేశారు. ఒంటరిగా భారీ ఎత్తున థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టగల (Crowd Pulling) సత్తా సమంతకు ఉందని ఈ చిత్రం గట్టిగా చాటిచెప్పిందని ఆయన కొనియాడారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దేశీయంగా దాదాపు 27.20 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది.
గతంలో రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో ‘రాజి’ పాత్రతో సమంత డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లోనూ సామ్ అదిరిపోయే యాక్షన్ విన్యాసాలతో మెప్పించింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కథను కూడా రాజ్ నిడిమోరు అందించగా, బి.వి. నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. సమంత తన స్వంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
ఈ సినిమా సాధిస్తున్న ఘన విజయంపై సోషల్ మీడియాలో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒక సాదాసీదా కోడలిగా కనిపిస్తూనే, కుటుంబం కోసం ఆయుధం పట్టిన వీరనారిగా సమంత చూపించిన నటనకు థియేటర్లలో చప్పట్లు, ఈలలు మారుమోగుతున్నాయి. విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటికే 46 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఈ మాస్ సక్సెస్‌తో సమంత తన తదుపరి ప్రాజెక్టులకు మరిన్ని భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకునేందుకు సిద్ధమవుతోంది.
![]() |
![]() |