![]() |
![]() |
టాలీవుడ్‌లో తనదైన నటనతో, కటౌట్‌కే తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘మాస్ ప్రొడక్ట్’ అనిపించుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్. కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ యాక్షన్ స్టార్, ప్రస్తుతం సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ లవర్స్‌కు, అభిమానులకు ఊహించని రేంజ్‌లో ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఆయన తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ లేపుతోంది.
ఈ సరికొత్త యాక్షన్ డ్రామాను టాలీవుడ్‌లో వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించి తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ '70mm ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మిస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు వి. వెంకట్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా గోపీచంద్ సరికొత్త మాస్ మేకోవర్‌లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు ఈ చిన్న గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది.
రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లోకి వెళితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సౌండ్ డిజైనింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా రేంజ్ ఏంటనేది చూపిస్తున్నాయి. చీకటి గదిలో రక్తసిక్తమైన గాయాలతో, కరుడుగట్టిన గడ్డంతో ఉన్న గోపీచంద్ కళ్లు తెరిచి చూసే షాట్ మెగా మాస్‌గా ఉంది. ఆ వెంటనే ఆయన ఒక భారీ సుత్తిని పట్టుకుని చేతితో పైకి లేపే సీన్ చూస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ‘సింగ’ అనే టైటిల్ లోగో డిజైన్ కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా, ఒక వెపన్‌లా డిజైన్ చేయడం విశేషం. గ్లింప్స్‌కి సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ అనార్కలి నాజర్ హీరోయిన్`గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ బెస్ట్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ గ్లింప్స్‌పై మెగాస్టార్ చిరంజీవి, పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ గోపీచంద్‌కు బర్త్‌డే విషెస్ తెలపడంతో పాటు 'సింగ' గ్లింప్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమా ఉండబోతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనుంది.
![]() |
![]() |