Home  »  News  »  మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కిన జయం రవి భార్య.. ఈ సారి ఎందుకో తెలిస్తే షాక్ గ్యారంటీ

Updated : Jun 10, 2026

 


కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi)ఆయన భార్య ఆర్తి  మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతు సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మద్రాస్ హైకోర్టులో జయం రవికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన భార్య ఆర్తి దాఖలు చేసిన తాత్కాలిక భరణం (ఇంటర్మీడియట్ మైంటైనెన్స్) కేసు విచారణకి సంబంధించిన గడువును పొడిగించాలంటూ జయం రవి దాఖలు చేసిన తాజా పిటిషన్‌ని న్యాయస్థానం  కొట్టివేసింది. జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ ఈ కీలకమైన కేసును విచారించి, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందంటే, గతేడాది 2025 ఏప్రిల్ నెల నుంచి జయం రవి తనతో పాటు తమ ఇద్దరు పిల్లల సంరక్షణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం లేదని భార్య ఆర్తి ఆరోపించారు. పిల్లల పాఠశాల ఫీజులతో పాటు వారి రోజువారీ విద్యా ఖర్చుల నిర్వహణ కూడా చాలా కష్టంగా మారిందని  చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుని ఆశ్రయించింది. అయితే ఫ్యామిలీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ వేగంగా జరగకపోవడంతో, ఆర్తి  నేరుగా మద్రాస్ హైకోర్టుని  ఆశ్రయించి అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఆర్తి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జె. రవీంద్రన్, పిల్లల చదువు, భవిష్యత్తు మరియు ఆర్థిక భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ భరణం పిటిషన్‌ను పూర్తిగా విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని దిగువ ఫ్యామిలీ కోర్టుని ఆదేశించింది.

Also read: సాంగ్ షూట్ లో ఆ హీరో పదేపదే నాకు ముద్దులుపెట్టాడు.. ఫ్యాన్స్ ఫీలైనా ఇది నిజం  

హైకోర్టు విధించిన ఈ రెండు వారాల గడువుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, విచారణని  పూర్తి చేయడానికి మరింత సమయం కావాలంటూ నటుడు జయం రవి మళ్లీ హైకోర్టులో ఒక కొత్త పిటిషన్ వేశారు. అయితే ఈ పొడిగింపు అభ్యర్థనను ఆర్తి న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్, గతంలో ఇచ్చిన రెండు వారాల గడువు ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేస్తూ జయం రవి దరఖాస్తుని  తిరస్కరించారు. ఒకవేళ ఏవైనా ఇతర ఉపశమనాలు లేదా విన్నపాలు ఉంటే నేరుగా చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులోనే పరిష్కరించుకోవాలని నటుడికి సూచించారు.  విడాకుల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు  ఎలాంటి సినిమాల్లో చెయ్యనని జయం రవి ప్రకటించిన విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.