Home  »  News  »  వివాదంలో అవ‌తార్‌.. జేమ్స్ కామెరూన్‌పై కోర్టుకెక్కిన హాలీవుడ్ హీరోయిన్‌!

Updated : May 7, 2026

ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టించిన ‘అవతార్’ సినిమా గురించి తెలియని వారు ఉండరు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. అవతార్‌లోని ప్రధాన పాత్ర అయిన 'నైటిరి' రూపాన్ని తన అనుమతి లేకుండా వాడేశారంటూ ఒక నటి సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కిన వార్త ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

ప్రముఖ హాలీవుడ్ నటి క్వారియాంకా కిల్చర్ తాజాగా జేమ్స్ కామెరూన్‌తో పాటు డిస్నీ సంస్థపై చట్టపరమైన చర్యలకు దిగింది. 2005లో వచ్చిన ‘ద న్యూ వరల్డ్’ సినిమాలో తను నటించినప్పుడు తీసిన ఫోటోల ఆధారంగానే ‘అవతార్’ హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. తన ముఖ కవళికలను, బయోమెట్రిక్ ఫీచర్లను ఎటువంటి అనుమతి తీసుకోకుండా వాణిజ్య పరంగా వాడుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ వివాదం మరింత ముదరడానికి కారణం గతంలో కామెరూన్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్. అందులో ఆయన ఒక స్కెచ్ చూపిస్తూ, నైటిరి పాత్రను రూపొందించడానికి క్వారియాంకా కిల్చర్ ముఖమే ప్రేరణ అని చెప్పడం విశేషం. అయితే ఆమెకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వకపోవడమే కాకుండా, కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా కోట్ల లాభాలు గడించారని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఒక చిన్న వయసున్న అమ్మాయి ముఖాన్ని డిజిటల్ పద్ధతిలో కాపీ చేయడం మోసమేనని వారు అంటున్నారు.

జేమ్స్ కామెరూన్ అంటేనే భారీతనానికి మారుపేరు. టైటానిక్ నుంచి నేటి అవతార్ వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక రికార్డు. అవతార్ మొదటి భాగం దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయగా, రెండో భాగం కూడా సంచలనం సృష్టించింది. మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా రిలీజ్ అయింది. ఇలాంటి కీలక సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు ఇది జస్ట్ ఇన్‌స్పిరేషన్ మాత్రమే అని కామెరూన్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం అనుమతి లేకుండా ఒకరి రూపాన్ని వాడటం తప్పేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది.

ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసుపై జేమ్స్ కామెరూన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం ‘అవతార్’ ఫ్రాంచైజీకి భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరోవైపు వచ్చే ఏడాది విడుదల కాబోతున్న అవతార్ తదుపరి భాగాలపై ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.