![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సిద్ధూ, తాజాగా ఒక క్రేజీ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
'తొలిప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇటీవల వెండితెరపై ఎమోషనల్ కథలను హ్యాండిల్ చేస్తున్నవెంకీ, తొలిసారి ఓటీటీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిద్ధూ ఎనర్జీకి, వెంకీ అట్లూరి మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సిరీస్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్‌లో సిద్ధూ సరసన యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మీనాక్షి, ఈ ప్రాజెక్టుతో డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతోంది. సిద్ధూ, మీనాక్షి, దర్శకుడు వెంకీ అట్లూరి.. ఈ ముగ్గురికీ ఇది తొలి వెబ్ సిరీస్ (Digital Debut) కావడం విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్ ఈ సిరీస్ పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ భారీ సిరీస్‌ను నిర్మిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సిరీస్‌ను ఒరిజినల్ కంటెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
సిద్ధూ జొన్నలగడ్డ టైమింగ్, మీనాక్షి చౌదరి గ్లామర్, వెంకీ అట్లూరి డైరెక్షన్.. ఈ కలయిక ఓటీటీ ప్రియులకు ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ తెరకెక్కిస్తున్న వెంకీ అట్లూరి.. ఆ తర్వాత ఈ సిరీస్ ను పట్టాలెక్కించనున్నట్లు వినికిడి.
![]() |
![]() |