![]() |
![]() |

‘వాల్తేరు వీరయ్య’తో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘Mega 158’ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘కాకాజీ’గా మెగాస్టార్
ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే ఈ వెరైటీ టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే టైటిల్ వినిపించినప్పటికీ, ఇప్పుడు దాదాపు ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుందని బాబీ భావిస్తున్నారట.
బాలీవుడ్ స్టార్ ఎంట్రీ?
ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ కపూర్ ఇప్పటికే ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తుండగా, ఇప్పుడు చిరు సినిమాలోనూ భాగం కాబోతుండటం విశేషం. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అంతేకాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, విలక్షణ నటుడు అనురాగ్ కశ్యప్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కూతురి పాత్రలో ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్ నటించనున్నట్లు టాక్.
ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ స్టార్ట్!
ఈ భారీ ప్రాజెక్టును ఏప్రిల్ 11న గ్రాండ్ లాంచ్ చేయగా, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ను పర్ఫెక్ట్‌గా చూపించిన బాబీ.. ఈసారి అంతకు మించిన యాక్షన్, బలమైన ఎమోషన్స్‌తో ‘కాకాజీ’ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్, ఇతర నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |