Home  »  News  »  68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసిన జాతీయ అవార్డు గ్ర‌హీత‌!

Updated : Apr 21, 2026

"చదువుకోవడానికి వయసుతో పనిలేదుష అనే మాట మ‌నం త‌ర‌చూ వింటూ ఉంటాం. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రాన్స్. 68 ఏళ్ల వయసులో ఆయన ఏడో తరగతి పరీక్షలు రాసి, వార్తల్లో నిలవడమే కాకుండా కొన్ని వేల మందికి కొత్త ఆశను కల్పించారు. చదువుపై ఆయనకున్న మక్కువ, పట్టుదల ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

కేరళకు చెందిన ఇంద్రాన్స్ అసలు పేరు సురేంద్రన్ కొచ్చూవేలు. ఆయన బాల్యం అంత సులభంగా సాగలేదు. తీవ్రమైన పేదరికం కారణంగా ఆయన తన చదువును కేవలం నాలుగో తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం కుట్టుపనిని వృత్తిగా ఎంచుకుని, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు.

సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, అద్భుతమైన నటుడిగా ఎదిగారు. న‌టుడిగా 45 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని ఇప్ప‌టికీ సినిమాలు చేస్తున్న ఇంద్రాన్ త‌న కెరీర్‌లో 550 సినిమాల్లో వివిధ పాత్ర‌లు పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తన మనసులో ఎక్కడో ఒక మూల చదువు మధ్యలో ఆగిపోయిందనే అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఆ వెలితిని పూడ్చుకోవడానికి ఆయన వృద్ధాప్యంలో మళ్లీ పుస్తకాలు పట్టారు.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "అక్షరాస్యత మిషన్" పథకం ద్వారా ఇంద్రాన్స్ తన విద్యాభ్యాసాన్ని పునఃప్రారంభించారు. తిరువనంతపురంలోని అట్టక్కులంగర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఆయన ఏడో తరగతి సమానత్వ పరీక్షలకు హాజరయ్యారు. మలయాళం, ఇంగ్లీష్, హిందీ, సామాజిక శాస్త్రం, గణితం వంటి సబ్జెక్టుల్లో ఆయన పరీక్షలు రాశారు. సామాన్య విద్యార్థిలాగే బెంచీపై కూర్చుని పరీక్ష రాస్తున్న ఆయనను చూసి తోటి అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు.

ఏడో తరగతితోనే ఆయన ఆగడం లేదు. తనకు ఆరోగ్యం సహకరిస్తే, వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే తాను ఈ ప్రయత్నం చేస్తున్నానని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. "చదువుకోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల కుదరలేదు. ఇప్పుడు అక్షరాస్యత మిషన్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను అంటున్నారు" ఇంద్రాన్స్‌.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.