![]() |
![]() |
![]()
హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా వస్తున్న తదుపరి చిత్రం "మహావతార్ పరశురామ్" (Mahavatar Parshuram). పరశురామ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
పౌరాణిక గాథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి కథాంశంతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ క్రమంలోనే "మహావతార్ పరశురామ్" సినిమాపై అందరి దృష్టి పడింది. "ధర్మం క్షీణించినప్పుడు.. పరశు(యుద్ధ గొడ్డలి) ఉదయిస్తుంది" అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత శక్తివంతంగా ఉంది. ఇందులో పరశురాముడు చేతిలో గొడ్డలి పట్టుకుని యుద్ధభూమిలో శత్రు సంహారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గొడ్డలి నుండి రక్తం కారుతుండటం, చుట్టూ సైన్యం ఉండటం చూస్తుంటే.. ఇది కేవలం పౌరాణిక సినిమా మాత్రమే కాకుండా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. పరశురాముడు కేవలం ఒక ముని మాత్రమే కాదు, అధర్మాన్ని ఎదిరించే ఒక మహాశక్తి అని పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
![]()
ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్ 2027లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
యానిమేషన్ ఫార్మాట్ లో పరశురాముడి వీరగాథను వెండితెరపై చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, అశ్విన్ కుమార్ మేకింగ్ స్టైల్ తోడైతే "మహావతార్ పరశురామ్" బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.
![]() |
![]() |