Home  »  News  »  రియల్ లైఫ్ లో 'రాజు వెడ్స్ రాంబాయి' ఘటన.. హెచ్ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య!

Updated : Apr 10, 2026

  • 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా ఎంత పని చేసింది?
  • యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు!
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువతి!

సినిమాల్లో చూపించే మంచిని ఫాలో అయ్యేవాళ్ళు పెద్దగా ఉండరు కానీ, చెడుని మాత్రం కొందరు ఫాలో అవుతుంటారు. 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) సినిమాని తలపిస్తూ తాజాగా హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఓ ఘటన కంటతడి పెట్టిస్తుంది.

గతేడాది చిన్న సినిమాగా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి' పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి.. అత్యంత కిరాతకంగా హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఉన్న ఇంజెక్షన్ ను ఆమెకు ఇస్తాడు. మూవీ చూసిన చాలామందిని ఈ సీన్ డిస్టర్బ్ చేసింది. ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్ అని మూవీ టీమ్ చెప్పినప్పటికీ.. దీనిని అందరూ జీర్ణించుకోలేకపోయారు.

అయితే 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా వచ్చిన తర్వాత.. ఇటీవల ఈ తరహా ఘటనలు నిజంగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని, ఒక యువతికి బలవంతంగా హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఇప్పటికే జైలులో ఉండగా.. ఆ ఇంజెక్షన్ వల్ల తన ఆరోగ్యానికి ఏమవుతుందోనన్న భయంతో, మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్‌లోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప నివాసి అయిన రమణి అనే యువతికి, మనోహర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని రమణిపై ఒత్తిడి తెచ్చాడు మనోహర్ . అయితే, మనోహర్ అప్పటికే హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నాడన్న విషయం రమణికి తెలిసింది. దీంతో అతనితో పెళ్లికి నిరాకరించింది. 

తనతో పెళ్ళికి ఒప్పుకోలేదన్న కోపంతో రమణిపై పగ పెంచుకున్నాడు మనోహర్. గత నెల 11వ తేదీన రమణి ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవకు దిగాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న హెచ్ఐవీ ఇంజెక్షన్‌ను రమణికి బలవంతంగా ఇచ్చాడు. ఈ దారుణమైన చర్య తర్వాత మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం అతను జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఒకవైపు హెచ్ఐవీ రక్తాన్నితన శరీరంలోకి ఎక్కించడం, మరోవైపు సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి రమణి తీవ్రంగా ఆందోళన చెందింది. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఆమె మనస్తాపానికి గురైంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తన ప్రాణంపై గ్యారెంటీ లేదన్న భయం కూడా ఆమెను కుంగదీసింది. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని తన నివాసంలోనే తాజాగా ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడీ వార్త అందరిచేత కంటతడి పెట్టిస్తుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.