![]() |
![]() |
‘పూర్వకాలంలో నరకాసురుడనే రాక్షసుండేవాడు. అతను ప్రజల్ని చాలా రకాలుగా హింసించేవాడు. అందుకే శ్రీకృష్ణుడు.. సత్యభామతో కలిసి.. అతన్ని..’ అంటూ నేచురల్ స్టార్ నాని వెరైటీగా హిందీలో చెప్పే డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ‘సరిపోదా శనివారం’ సినిమాకి సంబంధించి ‘నాట్ ఎ టీజర్’ పేరుతో శనివారం విడుదల చేశారు. జూలై 20 నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య పుట్టినరోజు కావడంతో ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. గతంలో విడుదలైన ఈ సినిమా మొదటి గ్లింప్స్, సాంగ్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అంతకుముందు విడుదల చేసిన గ్లింప్స్‌లో హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేయగా, ఈరోజు విలన్ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. విలన్‌గా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఎస్.జె.సూర్యకు కొట్టిన పిండే కావడం వల్ల తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడనిపిస్తుంది. విలన్ అరాచకాలను చూపించే సన్నివేశాలు, రౌడీలను మట్టి కరిపించి చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే సర్’ అని నాని చెప్పే డైలాగ్ సూర్య బర్త్‌డేకి బాగా మ్యాచ్ అయింది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు.

ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆగస్ట్ 29న విడుదల కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి.. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో ప్రియాంక-నాని కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.
![]() |
![]() |