![]() |
![]() |

మహానటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా జరిగిన ఆయన విగ్రహావిష్కరణలో విలక్షణ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి గురించి మాట్లాడాలంటే నేను ఓ పుస్తకం రాయొచ్చు. తిరుపతిలో నేను చదువుకునే రోజుల్లో అక్కినేనిగారి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతోందని తెలిసి ఆయన్ని కలవాలని చొక్కా చించుకొని మరీ వెళ్ళినవాడిని. ఆ తర్వాత ఆయన నటించిన మరపురాని మనిషి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి ఎన్నో సినిమాల్లో నేను నటించాను. ఇది భగవంతుని ఆశీర్వచనం.
ఒకరోజు నేను అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్‌కి వచ్చినపుడు నాకంటే ముందు నాగేశ్వరరావుగారు ఫ్లోర్ ముందు కూర్చున్నారు. దాసరి నారాయణరావుగారు లోపల ఉన్నారు. నేను లేట్‌గా వచ్చాను. నమస్కారం చేశాను. దానికాయన ‘అలా వున్నావేమిటి’ అని అడిగారు. ‘నాకు ఒక కోరిక ఉంది సార్. ప్రతిసారీ మీరొస్తే నేను లేచి నిలబడడం కాదు, నేనొస్తే మీరు లేచి నిలబడాలని నా కోరిక సార్’ అన్నాను. మరుసటి రోజు అదే ఫ్లోర్ బయట నాగేశ్వరరావుగారు, దాసరి నారాయణరావుగారు కూర్చొని ఉన్నప్పుడు నేను వెళ్ళాను. వెంటనే వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు. ‘అదేమిటి సార్ ఇద్దరూ లేచి నిలబడ్డారు’ అని అడిగాను. ‘లేదు లేదు. నీ కోరిక కదా మేం లేచి నిలబడాలని’ అన్నారు. ఆవిధమైన చమత్కారాలు ఆయనతో నాకు ఎన్నో ఉన్నాయి. ఆయన ఒక పాఠ్యపుస్తకం. గ్రంథాలయంలో ఉన్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అక్కినేనిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
![]() |
![]() |