Home

»

Latest News

మెగాస్టార్‌కి ఓ ప్రేమ‌లేఖ‌

Jan 7, 2017 1:58PM

 


 


డియ‌ర్ చిరు....

ఈ పేరు పెద‌విపై వాలితే చాలు... మ‌న‌సెంత పుల‌కించిపోతుందో..?  నీపై కొండంత‌ అభిమానాన్ని దాచుకోలేక స‌దా నీ పేరు ప‌ల‌వ‌రించే ఏ గుండె అయినా అడుగు... పూస గుచ్చిన‌ట్టు చెబుతుంది. నీ న‌వ్వు, నీ స్టైల్‌, నీచూపు, నీ డాన్స్‌, నీ మేన‌రిజం ఇవే క‌దా మా పంచ ప్రాణాలు. తొమ్మిదేళ్ల త‌ర‌వాత నిన్ను వెండి తెర‌పై మ‌ళ్లీ చూడాల‌ని మ‌న‌సెంత ఆరాట‌ప‌డుతోందో.  ప‌ద కొండో తారీఖున ఖైదీ నెం 150 రిలీజ్ అన‌గానే.. ఇప్పుడే ఈ క్ష‌ణ‌మే థియేట‌ర్ ద‌గ్గ‌ర క్యూ క‌ట్టేయ‌డానికి ప‌రుగులు పెడుతున్న నా పాదాల్ని అడుగు చెబుతాయి. నిజంగా చిరు... ఇన్నేళ్లు నిన్నెంత మిస్ అయిపోయామో..?  ఇండ్ర‌స్ట్రీకి ఎన్నో సూప‌ర్ హిట్లొచ్చాయి, బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలూ చూశాం. నీ ఇంట్లోంచి వ‌చ్చిన హీరోలు విజృంభించి న‌టించేస్తుంటే చ‌ప్ప‌ట్లు కూడా కొట్టాం. కానీ ఏదో వెలితి. టీవీలో ఏ ఘ‌రానా మొగుడో, గ్యాంగ్ లీడ‌రో వ‌స్తుంటే.. `అయ్యో చిరు.. అన‌వ‌స‌రంగా రాజ‌కీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరం అయ్యాడే` అనిపించేది. నీ మ‌న‌సు మ‌ళ్లీ సినిమాల‌వైపు మ‌ళ్లాల‌ని ఎన్నిసార్లు క‌ళామ‌త‌ల్లికి దండాలు పెట్టుకొన్నామో తెలుసా.?  ఇన్నేళ్ల‌కు మా క‌ల ఫ‌లించింది. నిన్ను మ‌ళ్లీ తెర‌పై చూడ‌బోతున్నాం. నీ కోసం మ‌ళ్లీ మా అభిమాన్నంతా ధార‌బోయ‌డానికి, నీ సినిమా టికెట్లు బ్లాకులో అయినా కొని తీర‌డానికి, నువ్వేసే స్టెప్పుల్ని ప‌దే ప‌దే చూడ్డానికి మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రావ‌డాని మేం స‌దా సిద్ధం..

కానీ చిన్న చిన్న దిద్దుబాట్లు, కంటికి క‌నీక‌నిపించ‌ని లోపాలు నీ సినిమాలోనూ క‌నిపిస్తున్నాయి. అవే అభిమానులమైన మ‌మ్మ‌ల్నంద‌రినీ బాధ పెడుతున్నాయి. నువ్వు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డం సంతోష‌మే. కాక‌పోతే... అంద‌రికీ తెలిసిన క‌త్తి రీమేక్ నే ఎందుకు ఏరి కోరి ఎంచుకొన్నావో మాకైతే అస్స‌లు అర్థం కావ‌డం లేదు. నువ్వు కోరుకొంటే, ప్ర‌య‌త్నిస్తే నీకు స‌రిప‌డ క‌థ‌లే దొర‌క‌వా..?   నీ హీరోయిజం, నీ డాన్సులు, నీ ఫైటింగులు, నీ రొమాన్స్ ఇలా చాలా చాలా చూశాం. 149 సినిమాలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా.. ఈ వ‌య‌సులో కూడా మ‌ళ్లీ అవే చూపించాల‌న్న ఆరాటం ఎందుకు చిరు నీకు..??   బాలీవుడ్‌ని కాస్త చూడు చిరు. ఆమీర్‌ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ వీళ్లంతా వ‌య‌సులో, అనుభ‌వంలో నీకంటే చిన్నోళ్లే. కానీ... వాళ్లెంత గొప్ప క‌థ‌ల్ని, గొప్ప‌పాత్ర‌ల్ని ఎంచుకొంటున్నారో ఒక్క‌సారి ఆలోచించ‌లేక‌పోయావా?  నువ్వు ఏ భ‌జ‌రంగీ భాయ్ జాన్‌లాంటి సినిమానో చేస్తానంటే, దంగ‌ల్ లో అమీర్ ఖాన్ లాంటి పాత్ర పోషిస్తానంటే మేం చూడం అన్నామా??  షష్టి పూర్తి చేసుకొని కూడా ఇంకా యంగ్‌గా క‌నిపించాల‌న్న తాప‌త్ర‌యం ఎందుకు చిరు..?   నీ జుత్తు మెరిసినంత మాత్రాన‌... నీపై మాకున్న అభిమానం త‌గ్గిపోతుంద‌నుకొన్నావా??

 పైగా కాజ‌ల్‌తో రొమాన్స్ ఏంటి??   మా బాస్ వారసుడు.. చిరుత‌తో క‌ల‌సి న‌టించిన క‌థానాయిక మ‌ళ్లీ నీతో రొమాన్స్ చేస్తుంటే మా హృద‌యం త‌ట్టుకోగ‌ల‌దా?  అల్లు అర్జున్‌తో ఆడి పాడిన క‌థానాయిక‌ని నీతో చూడ‌ల‌గ‌మా?  నీ త‌మ్ముడికి కూతురిగా న‌టించిన కాజ‌ల్‌తో డ్యూయెట్లు పాడడం నీకైనా భావ్యంగా అనిపించిందా??  చిరు.. అభిమానులుగా మా ప్రార్థ‌న ఒక్క‌టే. నువ్వు ఇలానే సినిమాలు చేస్తూ ఉండు. కానీ నీ స్థాయికీ, హోదాకీ స‌రిప‌డా పాత్ర‌ల్ని ఎంచుకో.. అప్పుడు కూడా నీ కోసం, నీ సినిమాల కోసం ఇలానే క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తుంటాం. ఇది మా ప్రామిస్‌!!

ఏదేమైనా... మ‌మ్మ‌ల్ని అల‌రించడానికి నువ్వు మ‌ళ్లీ వ‌స్తున్నావ్‌.. అదే చాలు!  రా అన్న‌య్యా.. వ‌చ్చేయ్‌.. నీకు మాత్ర‌మే సాధ్య‌మ‌య్యేలా వినోదం పంచు. రికార్డుల‌న్నీ ప‌ట్టుకెళ్లిపో!  సింహం ఇన్నాళ్లు రెస్ట్ తీసుకొంద‌ని, ఇప్పుడే వేట మొద‌లెట్టింద‌ని గ‌ర్వంగా నీ అభిమానులంతా చెప్పుకొనేలా ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టు. ఈ సంక్రాంతి సంబ‌రాల్ని రెట్టింపు చేయ్‌..  చేస్తావ్ క‌దూ.. నీ విజృంభ‌ణ క‌ళ్లారా చూడాల‌ని కోరుకొంటూ...


ఎప్ప‌టికీ నిన్ను అభిమానించే
నీ
ఫ్యాన్స్‌

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com