Home

»

Latest News

రాజమౌళి సినిమాలో విలన్‌గా విక్రమ్‌.. మహేష్‌కి జక్కన్న పెట్టిన కండిషన్‌ అదే!

Jul 6, 2024 9:32AM

భారీ సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ, వాటిలో రాజమౌళి సినిమాల తీరే వేరు, ఆ లెక్కే వేరు. ఒక సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళే ముందు అతను ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ముందే అతనికి ఎక్కువ పని ఉంటుందని ఇప్పటివరకు అతని నుంచి వచ్చిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. స్క్రిప్ట్‌ వర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంపిక నుంచి లొకేషన్‌ సెర్చింగ్‌ వరకు అన్నీ పక్కాగా కుదిరిన తర్వాతే రంగంలోకి దిగుతాడు రాజమౌళి. 

ప్రపంచ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించేందుకు టాలీవుడ్‌ ఎంతగా ప్రయత్నిస్తోందో ఇటీవలి కాలంలో తెలుగులో రూపొందిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఆ వరసలో ఇప్పుడు మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో పట్టాలెక్కబోతున్న ఎడ్వంచరస్‌ యాక్షన్‌ మూవీ కూడా చేరుతుంది. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, మహేష్‌తో చేయబోతున్న ఈ ఎడ్వంచర్‌ మరో ఎత్తు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాంబినేషన్‌లో సినిమా అని ఎనౌన్స్‌ చేసిన రోజు నుంచీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంత భారీ అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకు తగినట్టుగానే ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేస్తున్నాడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  రిలీజ్‌ అయి రెండు సంవత్సరాలు దాటిపోతున్నా తన తాజా సినిమా విషయంలో ఎలాంటి కంగారు పడకుండా కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. 

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మహేష్‌ తప్ప మరో ఆర్టిస్టును ఫైనల్‌ చెయ్యలేదు రాజమౌళి. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో మలయాళ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటిస్తాడని సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయంలో చిత్ర యూనిట్‌ మాత్రం ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. ఇక హీరోయిన్‌గా ఇండోనేషియాకు చెందిన చెస్లా అనే అమ్మాయిని తీసుకోబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. ఆ అమ్మాయిని ఈ సినిమా కోసం ఫైనల్‌ చేశారట. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త వైరల్‌ అవుతోంది. అదేమిటంటే.. మహేష్‌కి విలన్‌గా చియాన్‌ విక్రమ్‌ నటించబోతున్నాడనేదే ఆ వార్త. ఇప్పటికే విక్రమ్‌ని రాజమౌళి సంప్రదించాడని సమాచారం. రాజమౌళి తన సినిమాలో హీరోని సెలెక్ట్‌ చేయడంలో ఎంత కేర్‌ తీసుకుంటాడో విలన్‌ని ఎంపిక చేయడంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తాడని గత సినిమాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 

మహేష్‌, రాజమౌళి సినిమాలో విక్రమ్‌ విలన్‌గా నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద డిస్కషన్‌ పాయింట్‌ అయింది. రాజమౌళి లాంటి డైరెక్టర్‌ అడిగితే విక్రమ్‌ మాత్రం కాదంటాడా.. ఇది ఫిక్స్‌ అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విక్రమ్‌ ఈ సినిమాలో ఓకే అయినట్టే అని తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంపిక పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాని ప్రారంభిస్తారని సమాచారం. 2026లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కొన్ని సంవత్సరాలు కేటాయించాల్సిందే. ఇప్పుడు మహేష్‌ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా రిలీజ్‌ అయ్యే వరకు మహేష్‌ మరో సినిమా చేసే అవకాశం లేదు. అంతేకాదు, కొత్తగా కమర్షియల్‌ యాడ్స్‌కి సంబంధించిన షూటింగ్స్‌లో కూడా మహేష్‌ పార్టిసిపేట్‌ చెయ్యడు. ఈ సినిమాలో మహేష్‌ లుక్‌ ఎలా ఉంటుంది అనే విషయాన్ని రివీల్‌ చెయ్యకూడదన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఈ కండిషన్‌ పెట్టాడట. ఏది ఏమైనా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్‌డేట్స్‌ అఫీషియల్‌గా రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com