![]() |
![]() |

నటుడు సుధీర్‌బాబు ఇంట్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈరోజు ఆయన పెద్ద కొడుకు చరిత్ మానస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరిత్ బర్త్‌డే వేడుకతో పాటు మరో వేడుక కూడా అక్కడ జరిగింది. అది.. సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన మొదటి భార్య పెళ్లిరోజు వేడుక. అవును. ఇది నిజంగా అరుదైన సన్నివేశం. ఇందిరాదేవికి విడాకులివ్వకుండానే నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్న విషయం ప్రపంచానికంతటికీ తెలిసిందే. అప్పటినుంచీ ఇందిరాదేవి వేరుగా ఉంటూ వస్తున్నారు. చిన్నకుమార్తె ప్రియదర్శిని వివాహం సుధీర్‌బాబుతో జరిగాక, హైదరాబాద్‌లో వారి ఇంట్లోనే ఆమె ఉంటున్నారు. ఈ మధ్య విజయనిర్మల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. అయినప్పటికీ కృష్ణ అదే నివాసంలో ఉంటూ వస్తున్నారు. మొదటిభార్యను ఆయన కలిసిన సందర్భాలు ఉన్నట్లు కొన్నేళ్లుగా మనం చూడలేదు.
ఆదివారం మొదటిభార్య ఇందిరాదేవితో పెళ్లిరోజు రావడమే కాకుండా, ఇదే రోజు మనవడి పుట్టినరోజు కూడా కావడంతో కృష్ణ అల్లుడి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఇందిరాదేవి ఆయనకు కేక్ తినిపించారు. ఈ అరుదైన సన్నివేశాన్ని సుధీర్‌బాబు కుటుంబంతో పాటు కృష్ణ మరో కుమార్తె మంజుల కుటుంబం కూడా ఆస్వాదించింది. ఈ ఘట్టానికి సంబంధించిన పిక్చర్లను సుధీర్‌బాబు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. "It was Charith's bday and not just that ... It was also Krishna garu's wedding anniversary ... The connection is not coincidental I believe ... Magic" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణ-ఇందిరాదేవి కలయిక ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కృష్ణ అభిమానులు దీనిని సంబరంగా జరుపుకుంటున్నారు.




![]() |
![]() |