![]() |
![]() |
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. భారీ సినిమాలను నిర్మిస్తూ.. భారీగానే విజయాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్స్ సాధించిన ఈ సంస్థలో ‘పుష్ప2’, ‘ఖుషి’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి భారీ చిత్రాల నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 19 నుంచి ఈ సంస్థకు సంబంధించిన ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలోకి రూ. 700 కోట్ల విదేశీ పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ పెట్టుబడులు ముందుగా ముంబైకి చెందిన ఓ కంపెనీకి టాన్స్‌ఫర్ అయ్యాయని, ఆ తర్వాత ఏడు కంపెనీలకు బదిలీ చేశారని అధికారుల విచారణలో తేలింది. బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు అక్కడి స్టార్ డైరెక్టర్‌కు హవాలా ద్వారా రూ. 150 కోట్ల అందజేశారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తమ సంస్థలో సీక్వెల్ నిర్మాణం జరుపుకుంటున్న చిత్రంలోని హీరోకు కూడా ఇలాగే రెమ్యునరేషన్ అందించినట్టు సమాచారం. మరో ఇద్దరు టాప్ హీరోలకు కూడా ఇదే పద్ధతి ద్వారా చెల్లించిన డబ్బులోనూ లొసుగులున్నట్టు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అందుకే కొందరు హీరోల ఎకౌంట్లను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారట. ఆయా హీరోలను విచారణ నిమిత్తం ముంబైకి పిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ సంస్థ వెనక ఏపీ, తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు ఉన్నారని జనసేన లీడర్ ఆరోపించారు. దాని ఆధారంగానే ఈ తనిఖీలు నిర్వహించారు.
మైత్రి విషయంలో అమెజాన్ గుస్సా!
ఇదిలా ఉంటే.. అమెజాన్‌కు, మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఉన్న బిజినెస్ లింక్ కట్ అయిపోయిందని తెలుస్తోంది. పుష్ప2 సినిమా విషయంలో మైత్రి సంస్థ వ్యవహరించిన తీరే దానికి కారణమని సమాచారం. పుష్ప చిత్రం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సీక్వెల్ హక్కులు కూడా అమెజాన్‌కే వెళతాయని అందరూ భావించారు. అయితే సడన్‌గా ఈ సినిమా రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చింది మైత్రి సంస్థ. పుష్ప 2 రైట్స్ విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్‌కి రైట్స్ ఇవ్వడం పట్ల అమెజాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోందని సమాచారం. తమకు ఎలాంటి సమాచారం లేకుండా వేరే సంస్థకు ఓటీటీ రైట్స్ ఇవ్వడం పట్ల అమెజాన్ ప్రతినిధులు ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |