![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రచారం పొందిన వీరమల్లుపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. అందుకే దీని తర్వాత ప్రకటించిన పవన్ ఇతర సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలవుతున్నాయి కానీ, వీరమల్లుకి మాత్రం మోక్షం కలగడంలేదు. ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతుండటం, కొంతకాలంగా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేకపోవడంతో.. అసలు మొత్తానికే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేలా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకి, సినీ ప్రియులకి తాజాగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చోట్ల జరుగుతోందని తెలిపారు. ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుందని, ఆ థ్రిల్ ను ఆస్వాదించడం కోసం దయచేసి వేచి ఉండండని పేర్కొన్నారు. అలాగే అతి త్వరలో ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. అది మిమ్మల్ని సీటు అంచున ఉండేలా చేస్తుందని హామీ ఇచ్చారు.

మొత్తానికి తాజాగా ప్రకటనతో 'హరి హర వీరమల్లు' సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. అలాగే త్వరలో స్పెషల్ ప్రోమో రాబోతుందన్న ప్రకటన.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.
![]() |
![]() |