
వల్గారిటీ లేని కామెడీని చూస్తే వచ్చే సహజమైన నవ్వు ఎన్నో రోగాలని దరి చేరకుండా చేరుస్తుందనేది సినీ సూక్తి. నవ్వుకి అంతటి శక్తీ ఉంది. దేవుడు వరం ఇస్తానని చెప్పినా కాసేపాగి రమ్మని నవ్వుతూనే ఉంటాం. ఇప్పుడు ఆ లక్ష్యం దిశగానే తెలుగు, తమిళ మేకర్స్ అడుగులేస్తున్నారు
తెలుగు చిత్రసీమలో తనదైన యూత్ ఫుల్ కామెడీ టైమింగ్, విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఇంట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు సత్య, తమిళ చిత్రసీమలో టాప్ కమెడియన్‌గా రాజ్యమేలుతున్న యోగి బాబు కలిసి పూర్తిస్థాయి హీరోలుగా, ప్రధాన పాత్రల్లో ఒక వినోదాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 'రంగబలి' చిత్రంతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన పవన్ బాసంశెట్టి ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ తాజాగా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను చాలా డిఫరెంట్‌గా, సరదాగా డిజైన్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్ల సినిమాల అనౌన్స్‌మెంట్లను గుర్తుచేసేలా, ఒక రకమైన పారడీ శైలిలో ఈ వీడియోను రూపొందించడం ఈ గ్లింప్స్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతటా వైట్ డ్రెస్‌లలో దర్శనమిచ్చిన సత్య, యోగి బాబుల ఎంట్రీ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా నవ్వులు పూయించింది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరూ తమ భాషా సరిహద్దులను దాటి సరికొత్తగా అలరించబోతున్నారు. సాధారణంగా తెలుగు మాట్లాడే సత్య ఇందులో తమిళం మాట్లాడగా, తమిళనాడు స్టార్ యోగి బాబు పక్కా తెలుగు డైలాగ్స్ తో సందడి చేశారు. ఈ లాంగ్వేజ్ స్వ్యాపింగ్ కామెడీ థీమ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఇది కూడా చదవండి: ప్రముఖ హీరో సంచలన వ్యాఖ్యలు: థియేటర్లు ఇవ్వకపోతే ఏం చేస్తామంటే!

‘గోల్డెన్ భాగ్యం’ కేవలం ఒక సాధారణ కామెడీ డ్రామా మాత్రమే కాకుండా, అందులో క్రైమ్, రొమాన్స్, యాక్షన్ వంటి కమర్షియల్ హంగులను కూడా సమానంగా మేళవించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా జయశ్రీ, అతిరాజ్ నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్, సుదర్శన్, రోహిణి, సునీల్ రెడ్డి, తనికిళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తూ వినోదాన్ని రెట్టింపు చేయనున్నారు. సాంకేతిక విభాగంలో పవన్ సిహెచ్ స్వరపరిచిన సంగీతం, బబ్లూ అజు ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ కానుంది.
[Golden Bhagyam Title Glimpse, Golden Bhagyam, Satya Yogi Babu movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




