![]() |
![]() |
అతను చేసిన సినిమాలు తక్కువే అయినా ఇండియా లెవల్‌లో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనే లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్స్‌తో మంచి స్పీడు మీదున్న లోకేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజినీతో కూలీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ పని మొదలుపెడతారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరో పక్క సూర్యతో చేయబోతున్న రోలెక్స్ స్క్రిప్ట్‌ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలా చేతినిండా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న లోకేష్ మరో కొత్త సినిమా కూడా కమిట్ అయ్యారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండబోతోందని సమాచారం.
లోకేష్ కమిట్ అయిన కొత్త సినిమాలో ఆమిర్‌ఖాన్ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. ఫాంటసీ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో భారీ స్థాయి విఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుందట. లోకేష్ చెప్పిన కథ నచ్చడంతో ఆమిర్‌ఖాన్ తన సొంత నిర్మాణం సంస్థలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆమిర్‌కి లోకేష్ చెప్పిన ఈ కథ ఇప్పటిది కాదు. తను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధం చేసుకున్న కథ. మొదట ఈ సినిమా కోసం సూర్యను హీరోగా అనుకున్నారు లోకేష్. ఫాంటసీ మూవీ కావడం, విఎఫ్‌ఎక్స్ కూడా అధికంగా ఉండడం వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఈ కథను పక్కనపెట్టారు. ఇప్పుడు ఆమిర్‌ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి కనబరచడంతో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
![]() |
![]() |