![]() |
![]() |
భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా ‘దంగల్’. 2016లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావ్, సిద్ధార్థరాయ్ కపూర్ నిర్మించారు. రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.2000 కోట్లకుపైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ మహావీర్ సింగ్ ఫోగట్‌గా ఓ విభిన్నమైన పాత్రను పోషించారు. ఆయన కుమార్తెలు గీతా ఫోగట్‌గా ఫాతిమా సన షేక్, బబిత కుమారిగా సాన్యా మల్‌హోత్రా నటించారు. చిన్నప్పటి బబితగా సుహాని భట్నాగర్ నటించింది. ఈ సినిమాలో చేసిన నటీనటులందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడీ యూనిట్‌ను ఓ వార్త విషాదంలో ముంచెత్తుతోంది.
చిన్నప్పటి బబితగా నటించిన సుహాని భట్నాగర్ ఆకస్మికంగా మృతి చెందింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆమె మరణ వార్త విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. బాలనటిగా ‘దంగల్’లో నటించిన సుహానికి ఇప్పుడు 19 ఏళ్లు. హీరోయిన్‌గా బిజీ అయ్యేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టిన సుహానిని మృత్యువు కబళించింది.
బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు సుహానీకి జరిగిన ఒక ప్రమాదంలో కాలు విరిగింది. దానికి సంబంధించిన చికిత్స కోసం వాడుతున్న మెడిసన్ వికటించడం వల్లే సుహాని మృతి చెందిందని తెలుస్తోంది. అయితే ఆమె మృతికి గల కారణాలు ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇంత చిన్న వయసులో సుహాని మృత్యువు బారిన పడడాన్ని ‘దంగల్’ యూనిట్ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులెందరో ఆమె మృతి పట్ల తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |