![]() |
![]() |

ఐశ్వర్యా రాయ్ బచ్చన్, రణ్‌దీప్ హూడా కాంబినేషన్‌లో వచ్చిన 'సరబ్‌జీత్' సినిమాలో నటించిన యువ నటుడు రంజన్ సెహ్‌గల్ జూలై 11న మృతి చెందాడు. అతని వయసు 36 సంవత్సరాలు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో చండీగఢ్‌లోని ఒక హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచాడు. అందిన సమాచారం ప్రకారం, దీర్ఘకాలంగా రంజన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఆ అనారోగ్యం ఏమిటనేది వెల్లడి కాలేదు.
'సరబ్‌జీత్' మూవీలో రవీంద్ర పండిట్ అనే క్యారెక్టర్ పోషించాడు రంజన్. 2016లో వచ్చిన ఆ సినిమాను ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రంతో పాటు 'ఫోర్స్', 'కర్మ', పంజాబీ మూవీ 'మహి ఎన్ఆర్ఐ' వంటి సినిమాల్లో అతను నటించాడు. పంజాబ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనిది పాపులర్ ఫేస్. ఇక టెలివిజన్ రంగంలోనూ రంజన్ తనదైన ముద్ర వేశాడు. క్రైమ్ పెట్రోల్, సావ్‌ధాన్ ఇండియా, తుమ్ దేనా సాథ్ మేరా, భావర్, కుల్‌దీపక్, గుస్తఖ్ దిల్ వంటి సీరియల్స్‌లో నటించాడు.
2020 సంవత్సరం బాలీవుడ్ పలు విషాదాలను చవిచూస్తుండటం గమనార్హం. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్, జగ్‌దీప్ వంటి ఆణిముత్యాలను మనం కోల్పోయాం.
![]() |
![]() |