![]() |
![]() |
ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేయడం అనేది సినీ పరిశ్రమలో సర్వసాధారణం. కొన్నిసార్లు ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేసి హిట్ కొట్టడం లేదా ఫ్లాప్ అవడం మనం చూస్తుంటాం. అలా అల్లు అర్జున్ కోసం అనుకున్న కథతో తమిళ హీరో శివకార్తికేయన్ సినిమా చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా ‘అమరన్’. గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ.300 కోట్లకుపైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియా సామి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ పాత్రలో శివకార్తికేయన్ నటించగా, ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషించారు. ఈ క్యారెక్టర్‌ను అత్యద్భుతంగా పోషించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది సాయిపల్లవి.
సోని పిక్చర్స్‌తో కలిసి కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమా తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ‘అమరన్’. ఈ బయోపిక్‌లొ దర్శకుడు పెరియాసామి మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్. ఆ సమయంలో బన్నీ తన ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. అతని అపాయింట్‌మెంట్ దొరకడం కూడా కష్టమైపోవడంతో ఈ కథను శివకార్తికేయన్‌కు చెప్పారు. అతను వెంటనే ఓకే చెప్పడంతో సినిమా మొదలైంది. ఆ సమయంలో పుష్ప సిరీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు బన్నీ. పలుమార్లు బన్నీని కలవడం కోసం పెరియాసామి హైదరాబాద్ వచ్చారు. అతన్ని కలిసి కథ చెబుదామనుకున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదట. అప్పుడు శివకార్తికేయన్‌ను అప్రోచ్ అవ్వడం, ప్రాజెక్ట్ సెట్ అవ్వడం జరిగిపోయాయి. అలా ఓ బ్లాక్‌బస్టర్ మూవీని తనకు తెలియకుండానే మిస్ చేసుకున్నారు అల్లు అర్జున్.
![]() |
![]() |