![]() |
![]() |
‘హృదయ కాలేయం’ వంటి విచిత్రమైన కామెడీ సినిమాతో అందరి దృష్టిలోనూ పడిన డైరెక్టర్ సాయిరాజేష్. ఆ తర్వాత కూడా సంపూర్ణేష్‌బాబుతోనే ‘కొబ్బరిమట్ట’ తీసిన రాజేష్ గత ఏడాది డిఫరెంట్ ‘బేబి’ చిత్రంతో తనలోని అసలైన డైరెక్టర్‌ని బయటికి తెచ్చాడు. ఈ సినిమా సంచలన విజయంతో డైరెక్టర్‌గా తనేమిటో చూపించాడు. దీంతో అతనికి ఫాలోయింగ్ బాగానే పెరిగింది. ఇదిలా ఉంటే సాయిరాజేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. నెటిజన్లతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. ఈమధ్య తనకు ఎదురైన ఓ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
సాయి రాజేష్ ఫేస్‌బుక్‌లో ఇలా పోస్ట్ చేశాడు. ‘నిన్న ఒక స్నేహితుడి బలవంతం మీద, తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను. ‘నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహంలో ఏదీ అడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు’ అన్నాడు. సర్లే.. మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. ‘ఎంత గొప్ప సినిమా సర్’ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్‌మెన్‌కి, కొరియర్ బోయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి. బేబీ సినిమా డైరెక్టర్ అని 30 ఫోటోలు ఇప్పించారు.
ఒక గంట తర్వాత ప్లేట్‌లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు.. మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండీ, ఒక ఫోటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో’ అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయాయి’ అంటూ తనకు జరిగిన అవమానంతో కూడిన వింత అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు సాయిరాజేష్. తను సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఓ బేబీ’ డైరెక్టర్‌ని అనుకొని పొరబడ్డాడట. అతనికి ఏం మాట్లాడాలో తెలీక, అసలు విషయం చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాడట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. కొంతమంది పాపం సాయిరాజేష్ అని జాలి చూపిస్తున్నారు.
![]() |
![]() |