![]() |
![]() |

శుక్రవారం తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలో హాస్పిటల్‌లో చేరిన టాప్ కమెడియన్ వివేక్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం ఇంట్లో స్పృహతప్పి పడిపోయిన ఆయనను కుటుంబసభ్యులు చెన్నై వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆయనకు ఈసీఎంఓ అమర్చారు.
సిమ్స్‌లోని మెడికల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజు శివస్వామి మాట్లాడుతూ, "హార్ట్ బీట్ కోసం వివేక్‌కు ఐయానోట్రోపిక్ సపోర్ట్ అందించాం. కానీ శనివారం తెల్లవారజాము రెండు గంటల ప్రాంతం నుంచి ఆయన ఆరోగ్య స్థితి క్షీణించడం ప్రారంభించింది. బీపీ కంట్రోల్ తప్పిపోయింది. ఉదయం 4:35 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు." అని వెల్లడించారు.
1961 నవంబర్ 19న తమిళనాడులోని కోవిల్‌పట్టి అనే గ్రామంలో వివేక్ జన్మించారు. ఆయన అసలు పేరు వివేకనందన్. ఆయనకు భార్య అరుళ్‌సెల్వి, కుమారుడు ప్రసన్నకుమార్, కుమార్తెలు తేజస్విని, అమృతనందిని ఉన్నారు.
చెన్నై సెక్రటేరియట్‌లో పనిచేస్తూ ప్రవృత్తిగా స్టాండప్ కామెడీ చేసేవారు వివేక్. అలా దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిలోపడి 'మనదిల్ ఉరుత్తి వేండుమ్' (1987) సినిమాలో హీరోయిన్ సుహాసిని అన్నయ్యగా నటించడం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టారు. అనంతరం ఉద్యోగం వదిలేసి, పూర్తిస్థాయి యాక్టర్‌గా మారారు. రన్, సామి, పేరళగన్, పార్తీబన్ కణవు, అన్నియన్, ధూల్, శివాజీ, సింగమ్, మాపిళ్లై, విశ్వాసమ్ లాంటి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.
వివేక్ ఆకస్మిక మృతితో సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి నివాళులర్పించారు.
![]() |
![]() |