![]() |
![]() |
పలు భారతీయ భాషల్లో విలన్‌గా, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ సింగ్ రావత్ ఆగస్ట్ 4 మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ప్రదీప్‌సింగ్ జన్మించారు. బి.ఆర్.చోప్రా 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ద్వారా ఆయన నటన ప్రారంభమైంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంలో భిక్షు యాదవ్‌గా, ఛత్రపతి చిత్రంలో రాస్ బిహారీగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా విలక్షణ శైలి కలిగిన విలన్‌గా అన్ని భాషల్లోనూ పేరు తెచ్చుకున్నారు.
తెలుగులో ప్రదీప్ సింగ్ రావత్ నటించిన సినిమాలు సై, ఛత్రపతి, లక్ష్మి, దేశముదురు, యోగి, రగడ, రెబల్, నాయక్, బాద్‌షా, సరైనోడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య తదితర చిత్రాలు ఉన్నాయి. హిందీలో లగాన్, తమిళ్, హిందీ భాషల్లో గజిని చిత్రాలు ఆయనకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ విలక్షణమైన విలన్ నటుడిని కోల్పోయింది. సహనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
![]() |
![]() |