![]() |
![]() |

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న చిత్రాలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే హీరోలు తక్కువగా ఉంటారు. అందులో రానా దగ్గుబాటి ముందు వరుసలో ఉంటాడు. అయితే ఇప్పుడు తాను కూడా రూట్ మారుస్తున్నట్లు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. విరాట పర్వమే చివరిదని, ఇకపై ప్రయోగాత్మక చిత్రాలు చేయనని చెప్పాడు. ప్రస్తుతం 'విరాట పర్వం'కి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే రానా నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం కలుగుతోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.14 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన విరాట పర్వం.. మొదటి రోజు 1.42 కోట్ల షేర్, రెండో రోజు 0.85 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 2.27 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు దాదాపు అసాధ్యమే. తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల బిజినెస్ చేయగా.. మొదటి రోజు 90 లక్షలు, రెండో రోజు 63 లక్షలతో.. రెండు రోజుల్లో 1.53 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రెండు రోజుల్లో నైజాంలో 82 లక్షలు(బిజినెస్ 4 కోట్లు), సీడెడ్ లో 12 లక్షలు(బిజినెస్ 2 కోట్లు), ఆంధ్రాలో 59 లక్షలు(బిజినెస్ 5 కోట్లు) కలెక్ట్ చేసింది.
జూన్ 17న విడుదలైన విరాట పర్వం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా వస్తున్నాయి. నిజానికి ఇందులో సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర ప్రధాన మైనది. రానా కథ నచ్చి కీలక పాత్రలో నటించాడంతే. ఈ సినిమా వల్ల రానాకి పెద్దగా ఒరిగిందేమి లేదు. నటన, పాత్ర పరంగా సాయి పల్లవికే మెజారిటీ క్రెడిట్ వెళ్ళిపోతోంది. పైగా రానా ఖాతాలో మరో ప్లాప్ చేరుతోంది. ఈ సినిమా దారుణ కలెక్షన్స్ వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ తరం వాళ్ళు అంతగా ఆసక్తి చూపించలేదు. అలాగే ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సినిమాకి కొంత నష్టం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఒక మంచి సినిమాను ప్రేక్షకులను అందించాలన్న ఉద్దేశంతో తనని తాను తగ్గించుకొని రానా చేసిన ప్రయోగం తనకు చేదు ఫలితాన్ని మిగిల్చేలా ఉంది.
![]() |
![]() |