![]() |
![]() |

అప్పట్లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి (Vijayashanthi) పెట్టింది పేరు. ఆమె హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకొని.. లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఇక ఈ జనరేషన్ లో విజయశాంతి తరహాలో.. ఓ వైపు గ్లామర్ రోల్స్, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్ అంటే అనుష్క (Anushka Shetty) అని చెప్పవచ్చు. అలాంటిది ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది?. ప్రస్తుతం ఓ నిర్మాత ఈ ఇద్దరితో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.
2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్.కె. బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తాను ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే, తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు.
నిర్మాత ఎస్.కె. బషీద్ మాట్లాడుతూ.. "నేను అల్లరే అల్లరి సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమకు వచ్చాను. వ్యాపారవేత్తగా, నిర్మాతగా కొనసాగుతున్నాను. గతంలో దర్శకుడు సురేష్ కృష్ణకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ గారి కథతో అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాను. ఇంకా వారితో నేరుగా సంప్రదింపులు జరపలేదు. డిస్కషన్స్ చేయబోతున్నాం. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. ఒక పాట కంపోజిషన్ జరుగుతోంది." అన్నారు.
![]() |
![]() |