![]() |
![]() |

తమిళ హీరో ధనుష్ తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వేణు ఊడుగుల.
2018లో వచ్చిన 'నీదీ నాదీ ఒకే కథ'తో దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నాడు వేణు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2022లో తన రెండో సినిమా 'విరాట పర్వం'తో ప్రేక్షకులను పలకరించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసులు మాత్రం కురిపించలేకపోయింది. 'విరాట పర్వం' వచ్చి మూడేళ్లు దాటినా ఇంతవరకు వేణు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. మధ్యలో నాగచైతన్య, సూర్య వంటి హీరోల పేర్లు వినిపించాయి కానీ.. అందులో ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు దర్శకుడిగా వేణు మూడో సినిమా ఓకే అయినట్లు సమాచారం. వేణు చెప్పిన విభిన్న కథకు ధనుష్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
దర్శకుడిగా మూడో సినిమాకి చాలా సమయం తీసుకున్న వేణు ఊడుగుల.. ఈ గ్యాప్ లో నిర్మాతగా మారడం విశేషం. ఈటీవీ విన్ తో కలిసి 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమాని ఆయన నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
![]() |
![]() |