![]() |
![]() |

చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూసే కొత్త ప్రతిభావంతులను, యువ నటీనటులను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ #VenkyAnil5 - #NKRAR2 పేరుతో సోషల్ మీడియాలో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సర్క్యులేట్ అవుతోంది. ఈ విషయం చిత్ర యూనిట్ దృష్టికి రావడంతో, వారు వెంటనే స్పందించి ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ షైన్ స్క్రీన్స్ ఒక అధికారిక నోటీస్ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.
సరికొత్త కథాంశంతో రూపకల్పన అవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న సినిమా పేరును వాడుకుంటూ కొందరు వ్యక్తులు నకిలీ కాస్టింగ్ ప్రకటనలతో అమాయకులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చిత్ర బృందం గమనించింది. సోషల్ మీడియా ద్వారా ఈ నకిలీ ప్రచారం విపరీతంగా సాగుతోందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నకిలీ కాస్టింగ్ కాల్ ప్రకటనలతో తమ చిత్ర బృందానికి గానీ, నిర్మాణ సంస్థకు గానీ ఎలాంటి సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఎలాగైనా రాణించాలనే బలమైన కోరికతో ఉన్న నూతన నటీనటులను, సాధారణ ప్రజలను ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ సినిమా తరఫున కాస్టింగ్ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే, వారికి మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, పత్రాలు, డబ్బులు అస్సలు ఇవ్వవద్దని చిత్ర యూనిట్ హెచ్చరించింది. అవకాశాల పేరుతో డబ్బులు వసూలు చేసే ముఠాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తమ చిత్రానికి సంబంధించి ఏదైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే, అవి కేవలం నిర్మాణ సంస్థకు చెందిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే అధికారికంగా వెల్లడిస్తామని టీమ్ స్పష్టం చేసింది. సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించే వారు ఇటువంటి నకిలీ వార్తలకు దూరంగా ఉంటూ, కేవలం జెన్యూన్ సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు. ‘జాగ్రత్తగా ఉండండి.. మోసగాళ్ల బారిన పడవద్దు’ అంటూ నటీనటులను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మోసపూరిత కాస్టింగ్ కాల్ వ్యవహారంపై చిత్ర పరిశ్రమలో మరియు నెట్టింట ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
https://x.com/Shine_Screens/status/2068984072773456136
![]() |
![]() |