Home  »  News  »  Ustaad Bhagat Singh Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ

Updated : Mar 19, 2026

  • తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రావు రమేష్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు
  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
  • నేపథ్య సంగీతం:  ఎస్. తమన్
  • కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
  • ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: ఆనంద్ సాయి
  • రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
  • నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
  • బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 
  • విడుదల తేదీ: మార్చి 19, 2026

గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh). సెన్సేషనల్ కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ టీమ్ కూడా, ఇది ఒక బిగ్ స్టార్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ అని, వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూస్తారని చెప్పుకొచ్చింది. మరి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఆ రేంజ్ లో ఉందా? గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేసిందా (Ustaad Bhagat Singh Review)

కథ:
ప్రజా సేవే జీవితంగా బ్రతికే ముఖ్యమంత్రి చంద్రశేఖర్(కె.ఎస్. రవికుమార్)పై హత్యాయత్నం జరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలిస్తారు. ఈ దాడికి కారకుడు క్రూరుడైన రాజకీయ నాయకుడు నల్ల నాగప్ప(పార్థిబన్). సీఎం కుర్చీపై అతనికి మోజు. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి నాగప్ప, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ ఆనందంలో నాగప్ప కొడుకు తన ఫ్రెండ్స్ తో కలిసి నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ తన మనిషికి చెందిన 25 టన్నుల గంజాయిని ఒక సీఐ సీజ్ చేయడంతో.. పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తాడు. ఈ విషయం తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగుతాడు. నాగప్ప మనుషులను కొట్టడమే కాకుండా, అతని కొడుకుని బందీగా ఉంచుకుంటాడు. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు? అతనికి, సీఎం చంద్రశేఖర్ కి మధ్య అనుబంధం ఏంటి? ఉస్తాద్ కి, నాగప్పకు మధ్య విరోధం ఏంటి? నాగప్పతో యుద్ధంలో ఉస్తాద్ గెలిచాడా? ఇందులో లీల(శ్రీలీల), శ్లోక(రాశి ఖన్నా) పాత్రలు ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
10-15 ఏళ్ళ క్రితం స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే తీసేవారు. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, డ్యాన్స్ లు, ఫైట్లు, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉండేలా చూసుకునేవారు. పాన్ ఇండియా ట్రెండ్ రావడం, ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారడంతో.. ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమాలకు దాదాపు కాలం చెల్లింది. ఇలాంటి టైములో వింటేజ్ వైబ్స్ చూపిస్తామంటూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటులో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' చేయడం ఒక రకంగా సాహసమే.

ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయడం తప్పు కాదు. కానీ, ఈ తరాన్ని మెప్పించేలా తీయడం కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో ఉస్తాద్ టీమ్ పూర్తిస్థాయిలో అయితే మెప్పించలేకపోయిందే చెప్పాలి. రొటీన్ కథను తీసుకొని, దానిని అంతే రొటీన్ గా ప్రెజెంట్ చేశారు. సీన్స్ లో ఫ్రెష్ నెస్ కనిపించలేదు. తెలిసిన కథ, తెలిసిన సన్నివేశాలే మళ్ళీ చూస్తున్నాము అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. ఈ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ, నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. ఆయన చేసే ఫైట్లు, చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. అయితే రాశి ఖన్నా ట్రాక్ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆ ట్రాక్ సినిమా నిడివిని పెంచడంతో పాటు, కథనాన్ని నెమ్మదించేలా చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడైతే ఉస్తాద్ గతం గురించి, అతను చేసే పని గురించి రివీల్ అవుతుందో అప్పటి నుంచి కథలో వేగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు సన్నివేశాలు మెప్పించాయి.

సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ ఎపిసోడ్స్ ని బాగానే ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా ఉస్తాద్ ఒక్కడే పాతబస్తీకి వెళ్ళి, వందల మందిని భయపెట్టి ఒక టెర్రరిస్ట్ ని తీసుకొచ్చే సీక్వెన్స్ హైలైట్ గా నిలిచింది. అలాగే నిర్భయ ఘటనను గుర్తుచేసే ఒక ఎపిసోడ్ కూడా కంటతడి పెట్టించేలా ఉంది. ఇక ఉస్తాద్-లీల లవ్ ట్రాక్ లో వచ్చే 'ఈ మనసే' సాంగ్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాలు బాగానే ఉన్నాయి.

లవ్, కామెడీ, ఎమోషన్ ఇలా ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ వాటిని బలంగా రాసుకోలేకపోయారు. కామెడీ పండలేదు. లవ్ ట్రాక్ ఇంకా బెటర్ గా రాసుకోవచ్చు. ఎమోషన్ వర్కౌట్ అయినప్పటికీ.. ఆ తరహా ఎపిసోడ్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసి ఉన్నాం. అందుకే రచన విషయంలో శ్రద్ధ పెట్టాల్సింది. సన్నివేశాల్లో కొత్తదనం, ఆసక్తికర కథనం తోడైతే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది.

కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు అంటారు. అదే సూత్రాన్ని పాటిస్తూ.. లాజిక్స్ కి దూరంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్ గురించి ఆలోచిస్తే.. కొంచెం కూడా ఎంజాయ్ చేయలేము. తెరపై పవన్ కళ్యాణ్ మ్యాజిక్ చూడటానికి మాత్రమే ఈ సినిమా చూడాలి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాకి ప్రధాన బలం పవన్ కళ్యాణ్ అనడంలో సందేహం లేదు. తన లుక్స్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన తెరపై కనిపించిన తీరు , డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ ప్రతిదీ ఫ్యాన్స్ ని అలరిస్తాయి. లీల పాత్రలో శ్రీలీల బాగానే రాణించింది. రాశి ఖన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉస్తాద్ ని ఢీ కొట్టే నల్ల నాగప్ప పాత్రలో పార్థిబన్ ఆకట్టుకున్నాడు. హెడ్ మాస్టర్ గా, చీఫ్ మినిస్టర్ గా చంద్రశేఖర్ రోల్ లో కె.ఎస్. రవికుమార్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. రావు రమేష్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. 

దర్శకుడిగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ కి ఇవ్వాలన్న ఆలోచన బాగుంది కానీ, రైటింగ్ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా లేదు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు బాగానే ఉన్నప్పటికీ, గబ్బర్ సింగ్ రేంజ్ అయితే ఏ మాత్రం కాదు. తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ లుక్, పర్ఫార్మెన్స్
ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథాకథనాలు
ప్రారంభ సన్నివేశాలు

ఫైనల్ గా...
పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, కొన్ని సీన్స్ మెప్పించాయి కానీ.. ఫుల్ మీల్స్ సినిమా అయితే కాదు. వింటేజ్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించాడు కాబట్టి, ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశముంది.

రేటింగ్: 2.5/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.