Home  »  News  »  ది ఒడిస్సీ మూవీ రివ్యూ

Updated : Jul 17, 2026

నటీనటులు: మ్యాట్ డామన్, ఆన్ హాత్వే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిజ్ థెరాన్, జెండయా, హిమేష్ పటేల్, లుపిటా న్యోంగో, సమంతా మోర్టన్

సాంకేతిక నిపుణులు:
మూలం: హోమర్ 'ఒడిస్సీ'
సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోయ్టెమా
ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్
సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్
రచన, దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్
నిర్మాతలు: ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్
పంపిణీ: యూనివర్సల్ పిక్చర్స్

అంతర్జాతీయ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఓపెన్ హైమర్' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న ఆయన, ఇప్పుడు గ్రీక్ పురాణ ఇతిహాసం (Greek Mythology) హోమర్ (Homer) రచించిన 'ఒడిస్సీ (The Odyssey)'ని తనదైన శైలిలో వెండితెరపైకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు జరిగిన భయంకరమైన ట్రోజన్ యుద్ధం (Trojan War) తర్వాత, ట్రాయ్ (Troy War) నగరాన్ని నాశనం చేసి, ఒడిస్సియస్ తన స్వగ్రామానికి చేసే సుదీర్ఘ ప్రయాణమే ఈ చిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:
ఇథాకా రాజు అయిన ఒడిస్సియస్ (Matt Damon), ట్రోజన్ యుద్ధంలో గ్రీకు రాజు అగమెమ్నాన్ (Benny Safdie) కు సాయం చేసి ట్రాయ్ నగరాన్ని నాశనం చేస్తాడు. కానీ, యుద్ధం మొదలై 20 ఏళ్లు, ముగిసి 10 ఏళ్లు గడుస్తున్నా అతను ఇంకా తన ఇంటికి చేరుకోడు. మరోవైపు, అతని భార్య పెనెలోప్ (Anne Hathaway), కొడుకు టెలిమాకస్ (Tom Holland) తమ రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటారు. రాణిని పెళ్లి చేసుకుని కొత్త రాజు అవ్వాలని ఆంటినస్ (Robert Pattinson) నాయకత్వంలో కొందరు ప్రయత్నిస్తుంటారు. సముద్రంపై ప్రయాణిస్తున్న ఒడిస్సియస్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు అతను ఇంటికి తిరిగి వచ్చాడా? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సముద్రంపై ఒక ఒంటరి వీరుడు చేసిన సాహస యాత్రను తీసుకుని, సినిమాటిక్ అద్భుతాన్ని ఎలా సృష్టించాలో క్రిస్టోఫర్ నోలన్ మరోసారి నిరూపించారు. కేవలం యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయకుండా, అదే స్థాయి అద్భుతాన్ని తనదైన శైలిలో చూపించారు. ఇంత పెద్ద యుద్ధాన్ని, ఆ తర్వాత సాగిన పోరాటాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించారు. సినిమాలో జరిగే ఏ అద్భుత సంఘటన కూడా జరుగుతున్నట్టు కాకుండా, పాత్రల జ్ఞాపకాలుగా చెప్పడం విశేషం.

ఎన్నో ఏళ్లుగా అందరూ చదువుకున్న, విన్న ఒక కథకు కొత్త కోణాన్ని ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ (IMAX) 70 ఎంఎంలో చిత్రీకరించినప్పటికీ, భారీ సంఘటనల వెనుక దాగి ఉన్న లోతైన మానవ భావోద్వేగాలను నోలన్ చాలా సున్నితంగా చూపించారు. ఒక సుదీర్ఘమైన పోరాటానికి అసలు ప్రేరణ ఏంటి? యుద్ధం చేయాలని ఎందుకు అనుకుంటారు? దానికి చెల్లించే మూల్యం ఏంటి? లాంటి ప్రశ్నలను అద్భుతంగా ఆవిష్కరించారు. హోమర్ మూలకథకు ఏమాత్రం భంగం కలగకుండా దేవుళ్ల ఉనికిని ప్రశ్నించకుండా.. దేవుడి సంకల్పానికి ఒక నిదర్శనంగా ఒడిస్సియస్ కథను చెప్పారు. గెలుపులో ఉన్న బాధను, విజయంలో ఉన్న ఒంటరితనాన్ని ప్రధాన పాత్ర అనుభవించే అపరాధ భావంగా చాలా అద్భుతంగా చూపించారు.

నోలన్ తన పాత చిత్రాలైన ఇన్సెప్షన్, డార్క్ నైట్, డంకిర్క్, టెనెట్ లాగా కాకుండా, ఇందులో నేరుగా యాక్షన్ సన్నివేశాల్లోకి వెళ్లిపోకుండా చాలా సంయమనం పాటించారు. కథలోని అసలు కోణాన్ని అర్థం చేసుకోవడానికి, మూలాలను స్థాపించడానికి ఆయన చాలా సమయం తీసుకున్నారు. దేనికైనా ఒక లోతైన అర్థం ఉంటుందని, దాన్ని అనుభూతి చెందాలని ఆయన భావించారు. అందుకే ఈ సినిమా స్క్రీన్ ప్లే రెగ్యులర్ భారీ హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లాగా వేగంగా ఉండదు.

నటీనటుల విషయానికి వస్తే మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్ అందరూ తమ అత్యుత్తమ నటనను కనబరిచారు. మ్యాట్ డామన్ లుక్ గుర్తుపట్టలేనంతగా ఉన్నా, నోలన్ రాసుకున్న వీరుడి పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయాడు. సాంకేతికంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయి. భారీ జీవులను కూడా చాలా వాస్తవికంగా, భయంకరంగా చూపించారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కథా పరంగా ఇది పాతదే అయినప్పటికీ, నోలన్ అడాప్టేషన్ దీన్ని కొత్తగా మార్చింది. అయితే కేవలం విజువల్స్, భారీ యాక్షన్ ఆశించి వెళ్లే వారికి ఈ సినిమా నెమ్మదిగా, కాస్త భారంగా అనిపించవచ్చు.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
సాంకేతిక అద్భుతం
నిర్మాణ విలువలు
భారీతనం

మైనస్ పాయింట్స్:
కొన్ని చోట్ల యాక్షన్ కొరియోగ్రఫీ మరీ సాధారణంగా ఉండటం
నెమ్మదిగా సాగే కథనం
పూర్తిగా నోలన్ శైలిలో సాగే సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే

 

బాటమ్ లైన్: ఇతిహాసాన్ని కొత్త కోణంలో చూపించిన మరో నోలన్ మార్క్ అద్భుతం.

రేటింగ్: 3/5

 

గమనిక: ఈ సమీక్షలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. స్పందించే ముందు పాఠకులు తమ విచక్షణను ఉపయోగించగలరు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.