![]() |
![]() |

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వస్తోన్న నర్సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. హైదరాబాద్, సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లో కిందపడి తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లినట్లు మొదట వదంతులు వ్యాపించాయి. అయితే వాటిని నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర ఖండించారు.
"నా భర్త గురువారం సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాంతో వెంటే మేం సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో ఆయనను చేర్పించాం. శుక్రవారం ఉదయం కూడా డయాలసిస్ చేయించాం. ఇంట్లో కిందపడి తలకి గాయాలయ్యాయనే ప్రచారం అవాస్తవం. ఆయనకు షుగర్ ఉంది. బీపీ పడిపోయింది. పైగా మెదడులో రక్తం గడ్డకట్టింది. అందువల్ల ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. డాక్టర్లు 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్నాం. అలా జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మకండి" అని చెప్పారు.
నర్సింగ్ యాదవ్ తనదైన విలక్షణ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చేసింది తక్కువ నిడివి పాత్రలైనా, ఎక్కువగా విలన్ గ్యాంగ్‌లో చేసిన సైడ్ క్యారెక్టర్లు అయినా తన డైలాగ్ డిక్షన్‌తో, నటనతో నవ్విస్తూ వచ్చారు. తొలినాళ్లలో రామ్‌గోపాల్ వర్మ సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చాయి. ముఖ్యంగా 'క్షణం క్షణం' మూవీలో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఇప్పటికీ మన కళ్లముందు మెదలాడుతూనే ఉంటుంది. అందుకనే తనకు యాక్టింగ్ నేర్పించింది రామ్‌గోపాల్ వర్మనే అని ఆయన చెబుతుంటారు.
![]() |
![]() |