![]() |
![]() |

ఒక హీరో ఇద్దరులా తెరపై కనిపిస్తేనే.. ఒకప్పుడు ఆశ్చర్యంగా చూశారట. అక్కినేని ’ఇద్దరు మిత్రులు’ సినిమా జనాలు ఇరగబడి చూడ్డానికి కారణం అదే. కథ కూడా బావుంటుందనుకోండి!. నిజానికి ద్విపాత్రాభినయం తొలిసారి చేసింది అక్కినేని మాత్రం కాదు. తెలుగు సినిమా తొలి రోజుల్లోనే ఓ పెద్దాయన రెండు పాత్రలు చేశారట. అయితే.. అది అంత రిజిస్టర్ కాలేదు. మనకు తెలిసిన తొలి ద్విపాత్రాభినయం ‘రాజు-పేద’ సినిమా. అందులో హీరో ఎన్టీయార్. కానీ.. ద్విపాత్రాభినయం చేసింది ఆయన కాదు. అందులో ఓ బాలనటునిది కీలక పాత్ర. అతనే ద్విపాత్రాభినయం చేశాడు. రెండో ద్విపాత్రాభినయ చిత్రం ‘చండీరాణి’. అందులో కూడా హీరో ఎన్టీయారే. కానీ.. రెండు పాత్రలు చేసింది ఆయన కాదు. భానుమతి రామకృష్ణ. హీరోల్లో తొలి సారి ద్విపాత్రాభినయం చేసిన ఘనత మాత్రం కచ్చితంగా అక్కినేని నాగేశ్వరరావుదే. ‘ఇద్దరు మిత్రులు’తో ఆ క్రెడిట్ కొట్టేశారాయన. ఆ తర్వాత విరివివిగా ద్విపాత్రాభినయాలు వచ్చాయ్. ఇప్పటికీ వస్తున్నాయి కూడా.
ద్విపాత్రాభినయం సంగతి సరే.. మరి త్రిపాత్రాభినయం తొలిసారి చేసిందెవరు? అనే సందేహం చాలామందిలో కలగడం సహజం. దీనికి సమాధానం కూడా చాలామందికి తెలీదు. తొలిసారి ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషించిన క్రెడిట్ ఎన్టీయార్ ది. సినిమా పేరు ‘కుల గౌరవం’. పేకేటి శివరామ్ దర్శకుడు. ఇందులో ఎన్టీయార్ తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు పాత్రలు పోషించి అదరహో అనిపించారు. ఇక ఆ తర్వాత ఏ ఏ సినిమాల్లో ఏ ఏ హీరోలు త్రిపాత్రాభినయాలు చేశారో సరదా గుర్తు చేసుకుందాం.
‘కుల గౌరవం’ తర్వాత వచ్చిన త్రిపాత్రాభినయం అంటే.. అది ‘దానవీర శూరకర్ణ’. హీరో ఎన్టీయారే. ఇందులో కృష్ణ, దుర్యోధన, కర్ణ పాత్రల్లో నభూతో న భవిష్యత్ అన్న రీతిలో చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు ఎన్టీయార్.
ఎన్టీయార్ తర్వాత కృష్ణ కూడా రెండు సార్లు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. 1970లో ‘కుమార రాజా’ సినిమాతో తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేశారు. 1984లో వచ్చిన ‘రక్త సంబంధం’లో రెండో సారి త్రిబుల్ రోల్ పోషించారు. వీరిద్దరి తర్వాత త్రిపాత్రాభినయం చేసిన కథానాయకుడు శోభన్ బాబు. ‘ముగ్గురు మొనగాళ్లు’(1984) శోభాన్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా.
ఇక చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’(1993)లో మూడు పాత్రలను పోషించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశాడు. మొన్నొచ్చిన ‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీయార్ త్రిబుల్ రోల్ పోషించాడు.
ఇదన్నమాట త్రిపాత్రాభినయం చేసిన వారి లిస్ట్. అయితే.. ఇందులో ఎన్టీయార్ ‘దాన వీర శూరకర్ణ’ చారిత్రాత్మక విజయాన్ని అందుకోగా, మిగిలిన సినిమాలన్నీ యావరేజ్ గా ఆడినవే. తారక్ చేసిన ‘జై లవకుశ’ మాత్రం మళ్లీ మంచి హిట్ అనిపించుకుంది.
![]() |
![]() |